నువ్వు నాకు చెప్పిన 'జేఎన్‌యూ' ఇదేనా?

20 Feb, 2016 18:42 IST|Sakshi
నువ్వు నాకు చెప్పిన 'జేఎన్‌యూ' ఇదేనా?


 ‘నేను జేఎన్‌యూలో చేరే ముందు మా అమ్మ జేఎన్‌యూ గురించి  అడిగింది. దేశంలోని ప్రఖ్యాత వర్సిటీలలో ఇది కూడా ఒకటి అని  నేను సమాధానమిచ్చాను. కానీ ఇప్పుడు  అక్కడ జరుగుతున్న పరిమాణాలను మీడియాలో చూసి ఇదేనా నువ్వు  చెప్పిన జేఎన్‌యూ అని మా అమ్మ ప్రశ్నిస్తోంద’ని జేఎన్‌యూ వర్సిటీ ఏబీవీపీ మాజీ సెక్రటరీ జనరల్  ప్రదీప్ నర్వాల్ వాపోయారు. జేఎన్‌యూలో తాజాగా జరుగుతున్న పరిమాణాలు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఇదే నెలలోనే ప్రదీప్, మరి కొంతమంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

తాజాగా వీరంతా కలిసి  జేఎన్‌యూ వివాదంలో కలగజేసుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో యూనివర్సిటీలో జరుగుతున్న పరిమాణాల కారణంగా అక్కడి విద్యార్థులకు భద్రత లేకుండా పోతోందని వాపోయారు. భద్రత కల్పించాల్సిన పోలీసులను రాజకీయ అవసరాల కోసం పార్టీలు వాడుకుంటున్నాయని, ఇప్పటికైనా ప్రధానిగా మీరు కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని  లేఖలో పేర్కొన్నారు. ‘నాకు తెలిసి యూనివర్సిటీ అంటే ఒక స్వతంత్ర వ్యవస్థ. అందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. యూనివర్సిటీలోని  విద్యార్థుల బాధలు తగ్గించాల్సింది పోయి జాతీయత  పేరుతో అక్కడ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా జేఎన్‌యూను ఓ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే నేను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు