ఆ ముగ్గురికి పటిష్ట భద్రత

25 Feb, 2016 03:33 IST|Sakshi
ఆ ముగ్గురికి పటిష్ట భద్రత

న్యూఢిల్లీ: జేఎన్‌యూ ఘటనలో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యతోపాటు రిమాండ్‌లో ఉన్న మరో ఇద్దరు విద్యార్థుల వివరాలపై గోప్యత పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పటిష్టమైన భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు  ఆదేశించింది. దీంతో పాటు ఉమర్ , అనిర్బన్ భట్టాచార్యలు పటియాలా కోర్టుకు విచారణకు వస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరటంతో కోర్టు వద్ద భద్రతపై స్పష్టంగా ఉండాలని ఆదేశించింది. కన్హయ్య బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. కాగా ఉమర్, అనిర్బన్‌లను మూడురోజుల పోలీసు రిమాండ్‌ను తరలిస్తూ సిటీ కోర్టు ఆదేశించింది.
 
కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్యే!
అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కన్హయ్యే నిర్వహించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.  అతనితోపాటు అరెస్టుచేసిన ఇద్దరు, మరికొందరు విదేశీయులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నారు.
 
కొత్త వీడియోలో బయటి వ్యక్తులు
ఫిబ్రవరి 9న దేశ వ్యతిరేక నినాదాలు చేసింది బయటి వ్యక్తులేననే ఆధారాలతో కొత్త వీడియో తెరపైకి వచ్చింది. విదేశీ శక్తులు వీడియోలు ఉన్నాయంటూ పోలీసులు కోర్టుకు చూపించిన ఈ వీడియోతో కేసు కొత్త మలుపు తిరగనుంది. కాగా, లొంగిపోయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఢిల్లీ పోలీసులు బుధవారం ఐదుగంటలపాటు ప్రశ్నించారు.
 ప్రభుత్వం భయపడుతోంది.. రాహుల్: జేఎన్‌యూ వివాదం విషయంపై పార్లమెంటులో తను లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.  

ఇదిలాఉండగా, జేఎన్‌యూలో విద్యార్థుల మెదళ్లను అక్కడి ప్రొఫెసర్లే కలుషితం చేస్తున్నారని మాజీ ఇన్ఫోసిస్ డెరైక్టర్  మోహన్‌దాప్ అన్నారు. కన్హయ్య, జర్నలిస్టులపై దాడికి యత్నించిన అడ్వకేట్ విక్రమ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.  విద్యార్థులపై కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రొఫెసర్లు జేఎన్‌యూలో కాగడా ర్యాలీ నిర్వహించారు.
 
క్యాండిల్ ర్యాలీ ఉద్రిక్తం
న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి తీసుకోకపోవటంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘అమ్మతోపాటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులను ఈడ్చేశారు’ అని రాజా తెలిపారు. వీరిని అరెస్టు చేసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గంటసేపటి తర్వాత వదిలిపెట్టారు.
 
ఢిల్లీకి రోహిత్ కుటుంబం మకాం
ఢిల్లీలోనే నివాసముండాలని రోహిత్ తల్లి రాధిక తెలిపారు. రాజాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఢిల్లీ సర్కారు అంగీకరించటంతో.. త్వరలోనే ఢిల్లీకి మారతామన్నారు. రోహిత్ ఫెల్లోషిప్ ఆగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలపడంతో అప్లైడ్ జియాలజీలో పీజీ పూర్తిచేసిన రాజాకు ఉద్యోగం ఇస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారన్నారు.

>
మరిన్ని వార్తలు