నాపై కూడా దాడి జరగొచ్చు: ఆయిషీ తండ్రి

6 Jan, 2020 09:27 IST|Sakshi

కోల్‌కతా: ‘ఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉంది’ అంటూ ఆయిషీ ఘోష్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేసేవాళ్లపై ఈవిధంగా దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం ముసుగులు ధరించిన దుండగులు తీవ్ర స్థాయిలో హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ తల పగిలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. (‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ )

కాగా తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా, హృదయ విదారకంగా విలపిస్తున్న ఘోష్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయిషీ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘ నా కూతురితో ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు. వేరే ఎవరో ఈ దాడి గురించి చెబితే నాకు తెలిసింది. అక్కడ హింస చెలరేగుతుందని భయం వేసింది. మాకు చాలా బాధగా ఉంది. చాలా కాలంగా శాంతియుతంగానే అక్కడ ఉద్యమం నడుస్తోంది. నా కూతురు తలకు ఐదు కుట్లు పడ్డాయి. తను వామపక్ష ఉద్యమంలో ఉంది. అయితే ప్రతీచోటా.. ప్రతీ ఒక్కరూ వామపక్షాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు’ఆయిషీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం)

ఇక ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జేఎన్‌యూ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజీనామా చేయాలని ఆయిషీ తల్లి డిమాండ్‌ చేశారు. ‘ఫీజు పెంపుదల గురించి విద్యార్థులు నిరసన చేపడుతున్నా.. వీసీ తనకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు. విద్యార్థులతో ఆయన అసలు చర్చలు జరపడం లేదు. అందుకే యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’ అని వీసీ తీరును తప్పుబట్టారు. అదే విధంగా నిరసనలో పాల్గొనకుండా తన కూతురిని వెనక్కి రమ్మని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ‘ తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉద్యమం చేస్తున్నారు. వారంతా గాయపడ్డారు. అయితే కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువగా గాయాలు తగిలాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్ధులు గతకొన్ని రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంటును ముట్టడించేందుకు విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్ధులు గాయాలపాలయ్యారు.

మరిన్ని వార్తలు