ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న అమెరికా మంత్రి

30 Aug, 2016 08:57 IST|Sakshi
ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న అమెరికా మంత్రి

అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. భారతదేశ పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన ఆయన.. భారీ వర్షం పుణ్యమాని దాదాపు గంట పాటు ఢిల్లీ వీధుల్లోనే ఉండిపోయారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లేటప్పుడు ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దాంతో కెర్రీతోపాటు వచ్చిన అమెరికా జర్నలిస్టులు టకటకా తమ ఫోన్లు తీసుకుని, ఢిల్లీ ట్రాఫిక్ జామ్ గురించి ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. వెంటనే భారత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి విదేశీ అతిథికి ఎలా భద్రత కల్పించాలో చర్చించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను అక్కడకు పంపి, తీన్‌మూర్తి మార్గ్ ప్రాంతంలోని ట్రాఫిక్ జామ్‌ను త్వరగా క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. శాంతిపథ్ - తీన్ మూర్తి మార్గ్ ప్రాంతం మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో దాదాపు గంట పాటు వాహనాలు ఏవీ కదల్లేదు. ఇతర మార్గాల్లో వాహనాలను అరగంట పాటు ఆపేసి మరీ కెర్రీ కాన్వాయ్‌ని పంపారు. ఇందుకోసం దాదాపు 50 మంది పోలీసులను మోహరించారు.

అయితే.. పోలీసులు మాత్రం జాన్ కెర్రీ ట్రాఫిక్‌లో చిక్కుకోలేదని, ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఆయన కోసం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ వరకు ఒక కారిడార్ మొత్తాన్ని క్లియర్ చేశామని అంటున్నారు. ఈయన కాన్వాయ్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తప్ప ఆయన ఇరుక్కోలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు.

ఢిల్లీలో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దేశ రాజధానిలో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం నత్తనడకన సాగింది. దక్షిణ ఢిల్లీలోని రింగ్‌రోడ్డు ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. పీక్ అవర్స్‌లో కూడా జల్లులు పడుతూనే ఉండటంతో రోడ్ల మీద నిలిచిపోయిన నీటిని తోడేందుకు అధికారులకు తలప్రాణం తోకకు వచ్చింది. పలు ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ఉన్నాయి. వాహనాలు ఆగిపోయాయి. సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఢిల్లీ- గుర్‌గావ్ ప్రాంతంలో ఇలాంటి ట్రాఫిక్ జామ్ పరిస్థితే ఏర్పడింది.

మరిన్ని వార్తలు