తోడ్పాటు అందిస్తాం

27 Oct, 2016 02:54 IST|Sakshi
తోడ్పాటు అందిస్తాం

భారత్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై న్యూజిలాండ్ ప్రధాని
- మోదీతో జాన్‌కీ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
- ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిర్ణయం
- పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు
 
 న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై తమ దేశం నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు. అయితే ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు చోటుపై న్యూజిలాండ్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి సంబంధించి పూర్తిస్థాయి చర్చ జరగలేదని, ఎన్‌ఎస్‌జీలోని 48 సభ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని జాన్ కీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జాన్ కీ.. ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని  నిర్ణయించాయి.

 అనంతరం మోదీ, జాన్ కీ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అలాగే పలు కీలకాంశాలపై విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీ, జాన్‌కీ సంయుక్త సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక, బహుపాక్షికంగా అన్ని రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినట్టు మోదీ చెప్పారు. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు మద్దతు ఇవ్వడంపై జాన్ కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భద్రత, నిఘా అంశాల్లో ఇరు దేశాల మధ్యా సహకారాన్ని పటిష్టపరిచేందుకు నిర్ణయించినట్టు మోదీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, టై నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయాలని, వారికి నిధులు అందే మార్గాలను నిలుపుదల చేయాలని నిర్ణయించామన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఆర్థిక సంబంధాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జీ అంశంపై చర్చలు ప్రోత్సాహకరంగా సాగాయని, భారతదేశ క్లీన్ ఎనర్జీ అవసరాలను న్యూజిలాండ్ అర్థం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
 
 ఈపీఎఫ్ దరఖాస్తులను పరిష్కరించండి: మోదీ

 న్యూఢిల్లీ: కార్మికులు, ఈపీఎఫ్ లబ్ధిదారుల దరఖాస్తులు భారీసంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను ఖరారుచేసే విధానాన్ని ఒక సంవత్సరం ముందుగానే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో భాగంగా మోదీ కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ ప్రగతిలో రేయింబగలు కష్టపడి పనిచేసే కార్మికుల భాగస్వామ్యం చాలా ఉందని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈపీఎఫ్ దరఖాస్తుల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. విన్నపాల పరిష్కారానికి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, ఎలక్ట్రానిక్ చలాన్, ఎస్‌ఎంఎస్‌లు, యూఏఎన్‌ను ఆధార్‌కు అనుసంధానించడం, టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టడంలాంటి వాటిని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులపైనా మోదీ సమీక్ష నిర్వహించారు. కాగా, పథకాల అమలును మరింత వేగవంతం చేసేందుకే కేంద్ర బడ్జెట్‌ను నెల ముందుకు జరిపామని, దీన్ని దృష్టిలోపెట్టుకొని అన్ని రాష్ట్రాలు తమ ప్రణాళికలను చూసుకోవాలని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు