జూన్‌ 19 నుంచి ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు

3 May, 2019 01:37 IST|Sakshi

నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు 

ఏర్పాట్లు పూర్తి చేసిన ఐఐటీ రూర్కీ.. 27న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్‌ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీని (జోసా) కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జోసా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను వచ్చే నెల 14న ఐఐటీ రూర్కీ ప్రకటించనుంది. దీంతో వచ్చే నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాలను చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. మొత్తానికి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మొత్తం 42 వేల సీట్ల భర్తీని జూలై 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 39,425 సీట్ల భర్తీకి ఏడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించిన జోసా ఈసారి అవసరమైతే 8 దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి 2 వేలకు పైగా ఈడబ్ల్యూఎస్‌ కోటా, బాలికల కోటా కింద సూపర్‌న్యూమరరీ సీట్లు రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 42 వేలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 39 వేల సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదట్లో 2.24 లక్షల మంది విద్యార్థులనే ఎంపిక చేసింది. అయితే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చివరకు 2,31,024 మందిని అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులోనూ అడ్వాన్స్‌డ్‌కు 1,65,656 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పలు కాలే జీల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి జేఈఈ మెయిన్‌లో టాప్‌ 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పించింది. అయితే ఈసారి ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచిచూడాల్సిందే. 

నేటి నుంచి దరఖాస్తులు 
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ 2.45 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన దాదాపు 35 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన వారిలో ఓపెన్‌ కేటగిరీలో 1,13,925 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 9,800 మంది, ఓబీసీలో 66,150 మంది, ఎస్సీలో 36,750 మంది, ఎస్టీల్లో 18,375 మంది ఉన్నారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రధాన తేదీలు 

 • ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం     
 • 9 సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ముగింపు 
 • 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం. 
 • ఈనెల 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
 • ఈనెల 27న: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష. 
 • జూన్‌ 4న జవాబు పత్రాల కీలు విడుదల. 
 • జూన్‌ 14న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు 
 • 14, 15 తేదీల్లో ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ 
 • 17న ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 
 • 21న ఫలితాలు 
 • జూన్‌ 19 నుంచి జూలై 15 వరకు సీట్ల కేటాయింపు 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు