‘నిర్భయ’ ఫ్రెండ్‌ ఇలాంటి వాడంటే నమ్మలేదు.. కానీ

12 Oct, 2019 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన నిర్భయ ఘటనలో కీలక సాక్షి, బాధితురాలి స్నేహితుడు అయిన అవనీంద్ర పాండే గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్భయ గురించి టీవీ కార్యక్రమాల్లో మాట్లాడేందుకు అతడు భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్‌ చేసేవాడంటూ ఓ జర్నలిస్టు వరుస ట్వీట్లు చేయడం కలకలం రేపుతోంది. 2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేసిన విషయం విదితమే. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి కన్నుమూయగా.. ఆమె స్నేహితుడు అవనీంద్ర పాండే ప్రాణాలతో బయటపడ్డాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యంత హేయమైన ఈ ఘటనకు సంబంధించిన విషయాలు నేటికీ వార్తల్లో నిలుస్తున్నాయి. 

ఈ క్రమంలో అవనీంద్ర ఇంటర్వ్యూ తీసుకునేందుకు అప్పట్లో పలు టీవీ ఛానళ్లు ఆసక్తి కనబరిచాయి. ఈ నేపథ్యంలో ఓ హిందీ ఛానెల్‌కు చెందిన ఎడిటర్‌ అజిత్‌ అంజుమ్‌ కూడా అవనీంద్రను తమ స్టూడియోకు రావాల్సిందిగా 2013లో కోరారు. ఇందుకోసం తమ సిబ్బందిని అతడి దగ్గరికి పంపించారు. అయితే డబ్బులు చెల్లిస్తేనే అవనీంద్ర స్టూడియోకు వస్తున్నాడని చెప్పడంతో తొలుత ఆశ్చర్యపోయిన అజిత్‌.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టినట్లుగా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు....‘ఈ ఘటన 2013 సెప్టెంబరులో జరిగింది. నిర్భయ అత్యాచార నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించిన నాటిది. ఆ సమయంలో నిర్భయ ఘటనకు సంబంధించిన కవరేజ్‌ అన్ని ఛానళ్లలోనూ ప్రసారమైంది. నిర్భయ స్నేహితుడు స్టూడియోలలో కూర్చుని తమకు జరిగిన అన్యాయాన్ని, హేయమైన నేరం గురించి అందరికీ చెబుతున్నాడు. నేను కూడా తనను ఇంటర్వ్యూ చేయాలని భావించాను. అందుకే స్టూడియోకు రావాల్సిందిగా కోరాను. కానీ నిర్భయ గురించి మాట్లాడటానికి అతడు డబ్బులు వసూలు చేస్తున్నాడని మా రిపోర్టర్లు చెబితే మొదట నమ్మలేదు.

కానీ నా ముందే మా రిపోర్టర్‌ తనకు ఫోన్‌ చేసి.. స్పీకర్‌ ఆన్‌ చేయడంతో ఆశ్చర్యపోయాను. అందుకే అతడిపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించాను. లక్ష రూపాయలు చెల్లించి అతడిని స్టూడియోకు రప్పించాము. ఈ తతంగమంతా రికార్డు చేశాము. నిర్భయకు జరిగిన అన్యాయంపై తన కళ్లల్లో నేనెప్పుడూ బాధ చూడలేదు. అందుకే తన నిజస్వరూపం అందరికీ తెలియజేయాలనుకున్నాను. మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాను. తను బుకాయించాడు. కానీ నేను రికార్డింగ్‌ చూపించే సరికి బిక్క ముఖం వేశాడు. ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పాడు. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టాలనుకున్నాను. కానీ దీని ఆధారంగా నిందితుల తరఫు న్యాయవాదులు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని ఊరుకున్నాను అని అజిత్‌ వరుస ట్వీట్లు చేశారు. కాగా నిర్భయ ఘటన నిందితుల్లో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు