బార్ఖాదత్‌కు బెదిరింపులు

9 Jun, 2018 15:05 IST|Sakshi
జర్నలిస్ట్‌ బార్ఖాదత్‌

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు పూర్తి రక్షణ ఉంటుందని భావించాను. ఓ వ్యక్తిగా నా హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదనే నమ్మకంతో కూడా ఉన్నాను. కాని నేడు నన్ను నీడలా వెంటాడుతున్నారు. నా కదలికలపై నిఘా కొనసాగుతోంది. నా ఇంటి గోడల్లో కూడా ఎన్నో నిఘా నేత్రాలు ఉండే ఉంటాయి. నేను ఓ టెలివిజన్‌ జర్నలిస్టుగా నా విధులను నిర్వర్తించుకుండా నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని, భారతీయ జనతా పార్టీలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీవీ జర్నలిస్ట్‌ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమంటూ లేదా మరే పనైనా చూసుకోమంటూ గతేడాది కాలంగా నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఆ బెదిరింపులు, వేధింపులు స్పష్టంగాను, కఠినంగా లేకపోవడం వల్ల ఇంతకాలం నేను వారికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేకపోయాను. 

వారి బెదిరింపులు చాలా సున్నితంగా, అస్పష్టంగా, కొన్నిసార్లు పరోక్షంగా ఉంటున్నాయి. నేను ఎన్డీటీవీలో పనిచేస్తున్నప్పుడు ప్రమోటర్లు వచ్చి నన్ను సున్నితంగా హెచ్చరించారు. నా కారణంగా వారిపై ఒత్తిళ్లు వస్తున్నాయట. నన్ను మరో ఉద్యోగం చేసుకోమని చెప్పారు. (2017, జనవరిలో బార్ఖాదత్‌ ఎన్డీటీవిని వదిలిపెట్టారు. ప్రస్తుతం మరో న్యూస్‌ ఛానల్‌ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్నారు) నేను కొత్త ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్న విషయం  కూడా వారికి తెల్సింది. అన్ని ప్రాజెక్టులను వదిలేయాలంటూ, 2019 వరకు జర్నలిజానికే దూరంగా ఉండాలంటూ నాకు బెదిరింపులు వస్తున్నాయి.

నా ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారు. నాపై ఐటీ దాడులు, ఈడి దాడులు చేయించేందుకు కాచుకుకూర్చున్నారట’ అంటూ సీనియర్‌ టెలివిజన్‌ జర్నలిస్ట్‌ బార్ఖాదత్‌ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో క్లుప్తంగా తాను ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి మొదటిసారి బయటపెట్టారు. శుక్రవారం ‘న్యూస్‌క్లిక్‌’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను మరింత వివరింగా చెప్పారు. 

ఉన్నతస్థాయి సమావేశం
‘ఇటీవల బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న ఓ మిత్రుడి నా ఇంటికి వచ్చారు. జర్నలిస్ట్‌గా బార్ఖాదత్‌ నోరుమూహించడం ఎలా ? అన్న అంశంపై ప్రభుత్వం పెద్దలు, పార్టీ పెద్దలు దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమై చర్చలు జరిపినట్లు ఆ మిత్రుడు చెప్పారు. ఆమె ఎవరితో ఉంటున్నారు? ఆమె ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరితో తిరుగుతున్నారు? ఆమె బ్యాంక్‌ వివరాలు ఏమిటీ? లాంటి ప్రశ్నలు ఆ సమావేశంలో వచ్చాయట. ఈ నేపథ్యంలో నా మిత్రులు నా రక్షణకు ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోమని సలహా ఇస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి భారత్‌లో వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వంలోగానీ, బీజేపీలోగానీ అందరు చెడ్డవాళ్లేమి ఉండరు. బీజేపీలో కూడా మంచి వాళ్లున్నారు. వారిలో అనేక మందిని నేను ఇంటర్వ్యూ చేశాను. అయినా గత ఏడాది కాలంగా ప్రభుత్వానికి మీడియా భయపడి పోతోందని, తాను ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఆమె అన్నారు.  న్యూస్‌ ఛానళ్లను అనుమతించడంలో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు.‘రిపబ్లిక్‌ టీవీ’కి మూడు నెలల్లో అన్ని అనుమతులు ఇచ్చారు. ఏడాదిన్నర నుంచి తిరుగుతున్నా రాఘవ్‌ బెల్‌కు అనుమతి రాలేదు’ అని ఆమె విమర్శించారు. 

బార్ఖాదత్‌ తనకు ఎదురవుతున్న బెదిరింపుల గురించి మళ్లీ ప్రస్థావిస్తూ 2002లో జరిగిన అల్లర్ల గురించి మళ్లీ గుర్తుచేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్, కరన్‌ థాపర్‌లతోని కలిసి తాను అల్లర్లను కవర్‌ చేసిన విషయాన్ని వారింకా మరచిపోయినట్లు లేదంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ డిగ్రీ చేసి, మాస్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసిన బార్ఖాదత్‌ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో జర్నలిజంలో పట్టాపుచ్చుకున్నారు. 1999లో కార్గిల్‌ యుద్ధాన్ని ప్రత్యక్షంగా కవర్‌ చేయడం ద్వారా విశేష ప్రశంసలు పొందిన ఆమెకు పద్మశ్రీ, బెస్ట్‌ యాంకర్‌తో పాటు పలు అవార్డులు వచ్చాయి. 

మరిన్ని వార్తలు