ప్రముఖ జర్నలిస్ట్‌ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత

23 Aug, 2018 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్‌, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్(95) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. 1923 ఆగష్టు 14న జన్మించిన ఆయన ఉర్ధూ పత్రిక అంజమ్‌లో జర్నలిస్ట్‌గా కేరీర్‌ ప్రారంభించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.  'బిట్వీన్‌​ ది లైన్స్‌' పేరుతో ప్రచురితమైన కాలమ్‌ దాదాపు 80 పత్రికల్లో ప్రచురితమయ్యింది. జర్నలిస్ట్‌గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ అనేక పోరాటాలు చేశారు. 

1990లో బ్రిటన్‌లో భారత రాయబారిగా సేవలందించారు. 1997లో రాజ్యసభకు కూడా నామినేట్‌ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో బియాండ్‌ ది లైన్స్‌, డిస్టెంట్‌ నైబర్స్‌ : ఎ టేల్‌ ఆఫ్‌ ది సబ్‌ కాంటినెంట్‌, ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ అండ్‌ అదర్స్‌, ఎమర్జెన్సీ రీ టోల్డ్‌ లు ఉన్నాయి. లోథిలో గురువారం మధ్యాహ్నం కుల్దీప్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుల్దీప్ నయ్యర్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,  వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పలువురు సీనియర్‌ జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు