యోగి కేసులో జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లు

10 Jun, 2019 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియాను ఢిల్లీలో శనివారం నాడు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా  మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారన్న అభియోగంతో కనోజియాను అరెస్ట్‌ చేశారు. ప్రధానంగా మహిళల అభిప్రాయాలను ప్రసారం చేసే ‘నేషనల్‌ లైవ్‌’ అనే టీవీ ఛానల్‌ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు మహిళ వీడియో క్లిప్పును ప్రసారం చేసినందుకే ఛానల్‌ ఎడిటర్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

కనోజియాపై భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్, సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఐపీఎస్‌ 500 సెక్షన్‌ ప్రకారం అది ‘నాన్‌కాగ్నిజబుల్‌’ నేరం. అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. ఈ సెక్షన్‌ కింద పోలీసులు ఎవరిని నేరుగా అరెస్ట్‌ చేయడానికి వీల్లేదు. ఎవరైనా కచ్చితమైన ఫిర్యాదు ఇచ్చిన పక్షంలోనే స్పందించాలి. ఈ కేసులో పరువు పోయే అవకాశం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కనుక, ఆయన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేసినప్పుడు మాత్రమే చట్ట నిబంధన ప్రకారం పోలీసులు స్పందించాలి.

ఆయన ఫిర్యాదు లేకుండానే పోలీసులు స్పందించారంటే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ప్రజా సంబంధాల టీమ్‌గా వ్యవహరించడమే. ఇక సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్‌ ఎవరి మీద దాఖలు చేయాలంటే మొత్తం ‘కంప్యూటర్‌ వ్యవస్థ స్తంభించడం’కు కారకుడైన వారిపైన. ఇక్కడ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ ఒకామీ వీడియో క్లిప్పింగ్‌ను ట్వీట్‌ ద్వారా షేర్‌ చేశారు. ఆయన ట్వీట్‌ ద్వారా మొత్తం కంప్యూటర్‌ వ్యవస్తే ఎలా స్తంభించిపోతుంది? ఇలా పోలీసులు అత్యుత్సాహంతో అన్యాయంగా భారతీయ పౌరులను అరెస్ట్‌ చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. అందుకనే భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి 180 దేశాల్లో భారత్‌కు 138వ స్థానం లభించింది.

వీటిలో దాదాపు 90 శాతం కేసులు కోర్టుల ముందు నిలబడవు. గత మేనెలలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పెట్టినందుకు అరెస్టయిన బీజేపీ కార్యకర్తను కోర్టు జోక్యం చేసుకొని వదిలేసింది. కోణార్క్‌ దేవాలయంపై బూతు బొమ్మలున్నాయంటూ వ్యాఖ్యానించి అరెస్టయిన కేంద్ర రక్షణ శాఖ విశ్లేషకుడిని కూడా కోర్టు విడుదల చేసింది.

మరిన్ని వార్తలు