జర్నలిస్టు రవీష్‌ కుమార్‌కు రామన్‌ మెగసెసే అవార్డు

2 Aug, 2019 10:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జర‍్నలిస్టు, ఎన్‌డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్‌ కుమార్‌ (44) ప్రఖ్యాత రామన్‌ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారని రామన్ మెగసెసే ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. జర‍్నలిజంలో రవీష్‌ కుమార్‌ అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.  2019 రామన్‌ మెగసెసే అవార్డు విజేతలుగా ప్రకటించిన ఐదుగురిలో కుమార్‌ ఒకరు. మిగిలిన నలుగురిలో మయన్మార్‌కు చెందిన కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన అంగ్ఖానా నీలపైజిత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్-కి ఉన్నారు.  ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 9 న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించబడే రామన్‌ మెగసెసే అవార్డును  సొంతం చేసుకోవడంపై పలువురు రవీష్‌ కుమార్‌కు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్  ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సేవ, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. 

మరిన్ని వార్తలు