సీజేఐపైనే అనుచిత వ్యాఖ్యలా?

6 Jul, 2018 03:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ పిటిషన్‌ అత్యవసర విచారణకు నిరాకరించినందుకు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచేలా పరోక్షంగా వ్యాఖ్యానించిన లాయర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో సదరు లాయర్‌ చేసిన వ్యాఖ్యలు, పంపిన సందేశాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని మండిపడింది. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది.

తామిచ్చే తీర్పులను ఏ వేదికపై చర్చించినా అభ్యంతరం లేదని, కానీ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. ‘కుప్పలుతెప్పలుగా వచ్చిపడే పిటిషన్‌లలో వేటిని అత్యవసరంగా విచారించాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఏదైనా పిటిషన్‌ అత్యవసర విచారణకు నిరాకరించినంత మాత్రాన సీజేఐని లక్ష్యంగా చేసుకుని సదరు లాయర్‌ సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తారా?’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ జడ్జి వ్యాఖ్యలను లాయర్‌ ఉటంకించడాన్ని కూడా బెంచ్‌ తప్పుపట్టింది. కోర్టులో ఊరట లభించకపోతే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బెంచ్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు