శ్రీనగర్‌ మేయర్‌గా అజిమ్‌ మట్టు

7 Nov, 2018 01:22 IST|Sakshi

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మాజీ నేత జునైద్‌ అజిమ్‌ మట్టు శ్రీనగర్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో జునైద్‌ అజిమ్‌ మట్టు బీజేపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతుతో మేయర్‌గా ఎన్నికైనట్లు ఎస్‌ఎంసీ కమిషనర్‌ పీర్‌ హఫీజుల్లా తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సెప్టెంబర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను వదిలి జునైద్‌ అజిమ్‌ మట్టు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎస్‌ఎంసీలో మొత్తం 76 ఓట్లకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థి గులామ్‌ రసూల్‌ హజమ్‌కు 26 ఓట్లు, మట్టుకి 40 ఓట్లు లభించాయి. ఎస్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 16 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మేయర్‌ పదవికి కనీసం 38 సీట్లు కావాల్సి ఉంది. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ 4 , బీజేపీ 5 గెలుపొందగా, 53 సీట్లను స్వతంత్రులు దక్కించుకున్నారు.   

మరిన్ని వార్తలు