పోలీసులకు షాక్ ఇచ్చిన సీరియల్ కిల్లర్

26 Jul, 2016 09:09 IST|Sakshi
పోలీసులకు షాక్ ఇచ్చిన సీరియల్ కిల్లర్

పట్నా: బ్యాంకు దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైశాలి జిల్లాలో బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'నన్ను ఇంటరాగేట్ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. గూగుల్ లో సైకో కిల్లర్ అమిత్ అని వెతికితే నా గురించి మొత్తం తెలుస్తోంద'ని పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాము వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అతడే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. పట్నా, వైశాలి ఇతర జిల్లాల్లో 22 హత్యలు చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి.

'సైకో సీరియల్ కిల్లర్'గా ముద్రబడిన అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్ ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివాడు. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో పనిచేశాడు. 2003లో అతడి తండ్రి హత్యకు గురైయ్యాడు. తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న పప్పుఖాన్ అనే వ్యక్తి చంపిన తర్వాత అమిత్ సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. పప్పు ఖాన్ శరీరంలోకి అమిత్ 32 బుల్లెట్లు దించాడని, తన తండ్రి హత్యకు కారకులైన మరో నలుగురిపై దాడి చేశాడని వైశాలి ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించారు.

బాలీవుడ్ సినిమా 'గ్యాంగ్ ఆఫ్‌ వాసేపూర్-2' సినిమా క్లైమాక్స్ ప్రేరణతో తన తండ్రిని హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసులతో అమిత్ చెప్పాడు. 60వ దశకంలో ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ పేరు కూడా అతడు ప్రస్తావించాడు. వైశాలిలో సెంట్రల్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఆదివారం అమిత్ పోలీసులకు పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు