నేడు కొలీజియం భేటీ!

11 May, 2018 02:13 IST|Sakshi

జస్టిస్‌ జోసెఫ్‌కు పదోన్నతిపై మరోసారి సిఫార్సు చేసే అవకాశం

సీజేఐకి జస్టిస్‌ చలమేశ్వర్‌ లేఖ

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జే.చలమేశ్వర్‌ బుధవారం లేఖ రాశారు.

జస్టిస్‌ జోసెఫ్‌ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్‌ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్‌ జోసెఫ్‌ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు.

అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్‌ చలమేశ్వర్‌ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్‌ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్‌ చలమేశ్వర్‌ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్‌ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ రిటైర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్‌ చలమేశ్వర్‌ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్‌లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు