పీసీఐ చైర్మన్‌గా జస్టిస్‌ సీకే ప్రసాద్‌

24 May, 2018 03:30 IST|Sakshi
జస్టిస్‌ చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ రెండోసారి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ గత వారం సమావేశమై.. జస్టిస్‌ సీకే ప్రసాద్‌ నియామకానికి ఆమోదం తెలిపింది. చట్టబద్ధ సంస్థ అయిన పీసీఐ.. ప్రింట్‌ మీడియా నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం.. కౌన్సిల్‌లో చైర్మన్‌తోపాటు మరో 28 మంది సభ్యులు ఉండాలి.

గత మార్చిలో 8 మంది నామినేటెడ్‌ సభ్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయగా.. మిగతా 20 మంది సభ్యుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. మిగతా సభ్యుల జాబితాను కూడా అందజేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉందని జస్టిస్‌ ప్రసాద్‌ తెలిపారు. బిహార్‌లోని పట్నా నగరంలో జన్మించిన జస్టిస్‌ ప్రసాద్‌.. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. 2008లో కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2009 మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2014 జూలై 14 వరకు సుప్రీంకోర్టు జడ్జీగా సేవలందించారు.

మరిన్ని వార్తలు