న్యాయవ్యవస్థ సమగ్రతే శిరోధార్యం కావాలి

7 May, 2020 04:06 IST|Sakshi

వీడ్కోలు సమావేశంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ దీపక్‌ గుప్తా

వీడియోకాన్ఫరెన్స్‌లో పదవీ విరమణ

న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ దీపక్‌ గుప్తా వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్‌ గుప్తా బుధవారం పదవీ విరమణ చేశారు.

సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా, బార్బర్స్‌ అందుబాటులో లేకపోవడంతో తన భార్యనే ఈ రోజు తనకు హెయిర్‌ కట్‌ చేసిందని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్‌ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్‌ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి.    

మరిన్ని వార్తలు