వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన జస్టిస్‌ చలమేశ్వర్‌

10 May, 2018 03:00 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెల 22న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) తలపెట్టిన వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గతవారం జస్టిస్‌ చలమేశ్వర్‌ను కలిసి వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించగా ఆయన తిరస్కరించారని ఎస్‌సీబీఏ కార్యదర్శి వికాస్‌ సింగ్‌ తెలిపారు. దీంతో బుధవారం తాము మరోసారి వెళ్లి, ఆయన్ను ఒప్పించేందుకు యత్నించగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారన్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ అయినప్పుడూ వీడ్కోలు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారని వికాస్‌ సింగ్‌ చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి పనిదినమైన ఈనెల 18న జస్టిస్‌ చలమేశ్వర్‌ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వికాస్‌ సింగ్‌ వివరించారు. కాగా, జస్టిస్‌ చలమేశ్వర్‌ గత మూడు వారాలుగా బుధవారం రోజు కోర్టు విధులకు హాజరుకావడం లేదని కోర్టు వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు