సుప్రీం ఎదుట హాజరైన జస్టిస్‌ కర్ణన్‌

1 Apr, 2017 03:04 IST|Sakshi
సుప్రీం ఎదుట హాజరైన జస్టిస్‌ కర్ణన్‌

వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువిచ్చిన ధర్మాసనం

న్యూఢిల్లీ: వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట శుక్ర వారం జస్టిస్‌ కర్ణన్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. భారత న్యాయ చరిత్రలో ఒక సిట్టింగ్‌ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. ఆయన హాజరును నమోదు చేసుకున్న న్యాయస్థానం.. వివిధ సంద ర్భాల్లో తోటి న్యాయమూర్తులకు సంబం ధించి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు ఆయనకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

అయితే తనకు తిరిగి న్యాయాధికారాలు పునరుద్ధరిం చాలంటూ కర్ణన్‌ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా తోటి న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం కర్ణన్‌కు సూచించింది. అయితే తన స్పందనను వెంటనే తెలియజేయడానికి ఆయన అంగీకరించకపోవడంతో..  సమయం తీసుకోవాలని,  న్యాయ సహాయం కూడా పొందవచ్చని పేర్కొంది. జస్టిస్‌ కర్ణన్‌ తన వాదనలు వినిపిస్తూ.. తన వాదనలను వినకుండానే సుప్రీంకోర్టు తన న్యాయాధి కారాలను తొలగించిందని చెప్పారు.

తనపై సుమోటోగా కోర్టు ధిక్కార అభియోగాలు నమోదు చేయడంపై తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. తన వాదనలను వినకుండానే తనను తప్పించారన్నారు. సాధారణ ప్రజల ముందు తన గౌరవానికి భంగం కలిగిందని చెప్పారు. పోలీసు అధికారులు తన కార్యాలయానికి వచ్చి వారంట్‌ అందజేశారని, ఇది తన ఒక్కడికే జరిగిన అవమానం కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకే అగౌరవమని చెప్పారు. దీనిపై ధర్మాసనంస్పందిస్తూ.. తొలుత జస్టిస్‌ కర్ణన్‌కు నోటీసులు జారీ చేశామని, అయితే ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్లే బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు