త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఖురేషి

22 Sep, 2019 04:50 IST|Sakshi

తాజాగా ప్రతిపాదించిన కొలీజియం

న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ఎ.ఎ. ఖురేషి పేరును సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించింది. గతంలో ఆయన్ను మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ కొలీజియం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిపై ఈ నెల 5వ తేదీన జరిగిన కొలీజియం భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఖురేషిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ మే 10వ తేదీన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై కేంద్రం ఆగస్టులో పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది.  మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదులు త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఎ.ఎ. ఖురేషి పేరును తాజాగా కేంద్రం పరిశీలనకు పంపింది. అయితే, జస్టిస్‌ ఎ.ఎ. ఖురేషి ఆదేశాల మేరకే 2010లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను పోలీసులు అరెస్టు చేశారని, తాజా పరిణామానికి అదే కారణమని గుజరాత్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్‌ యతిన్‌ ఓజా అనుమానం వ్యక్తం చేశారు.

జస్టిస్‌ తహిల్‌ రమణి రాజీనామా ఆమోదం
తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వీకే తహిల్‌ రమణి రాజీనామా ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది. తనను మేఘాలయ కోర్టుకు బదిలీచేయడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ తన రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు