జస్టిస్‌ జోసెఫ్‌ పదవీ విరమణ

30 Nov, 2018 04:47 IST|Sakshi
వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ జోసెఫ్‌తో సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ కరచాలనం

తీర్పులతో టాప్‌–10లో నిలిచిన న్యాయమూర్తి

సీజేఐ రోస్టర్‌ విధానంపై గళమెత్తిన జస్టిస్‌ జోసెఫ్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ గురువారం పదవీవిరమణ చేశారు.  ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్‌ జోసెఫ్‌ ఒకరని సుప్రీం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్‌ జోసెఫ్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన  ధర్మాసనంలో జోసెఫ్‌ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్‌ పరిరక్షణపై జస్టిస్‌ జోసెఫ్‌ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్‌ జ్యూడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ చట్టాన్ని జస్టిస్‌ జోసెఫ్‌ బెంచ్‌ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్‌–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్‌ జోసెఫ్‌ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు.

కేరళ నుంచి మొదలైన ప్రస్థానం..
జస్టిస్‌ జోసెఫ్‌ కేరళలో 1953, నవంబర్‌ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్‌ జోసెఫ్‌ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్‌ పదోన్నతి పొందారు.
 

మరిన్ని వార్తలు