పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి

19 Nov, 2014 01:03 IST|Sakshi

సుప్రీంకోర్టుకు సమ్మతి తెలిపిన హైకోర్టు న్యాయమూర్తి
 
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం ఆయన సమ్మతిని కోరింది. ఇందుకు ఆయన సమ్మతి తెలియజేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రస్తుతం పాట్నా హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రేఖామన్హర్‌లాల్ దోషిత్ వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పాట్నా హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడుతారు. పాట్నా వెళ్లేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి సమ్మతి తెలియచేసిన నేపథ్యంలో త్వరలోనే సుప్రీంకోర్టు కొలీజియం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపనున్నది. కేంద్రం కూడా ఆమోదముద్ర వేసిన తరువాత సంబంధిత ఫైలు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తరువాత పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి జరుగుతున్న మొట్టమొదటి నియామకం ఇదే. ఒకవేళ అన్నీ కలిసొస్తే, తెలంగాణ రాష్ట్ర కోటాలో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు సైతం వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి.. వరంగల్ జిల్లా, గవిచర్ల గ్రామంలో 1953 ఆగస్టు 1న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడి నుంచే పీజీ డిగ్రీ కూడా చేశారు.

1979లో న్యాయవాదిగా నమోదు చేసుకుని.. ప్రముఖ న్యాయకోవిదుడు పి.బాబుల్‌రెడ్డి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983 వరకు బాబుల్‌రెడ్డి వద్ద ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డి.. 1984 నుంచి స్వతంత్రంగా కేసులు వాదించడం మొదలు పెట్టారు. 1988-90 సంవత్సరాల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు.

తరువాత పలు ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు న్యాయసలహాదారుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా వ్యవహరించారు. 2001లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నో సంచలన కేసుల్లో జస్టిస్ నర్సింహారెడ్డి తీర్పులు వెలువరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా