జస్టిస్‌ లోయా మృతిపై విచారణ వాయిదా

16 Jan, 2018 12:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్‌ లోయా మృతికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలియాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లోయా మృతి కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించింది. వచ్చే వారానికి కేసును వాయిదా వేసిన కోర్టు పిటిషనర్లకు వివరాలు అందచేయాలని సూచించింది. ఈ కేసులో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.

ముంబయికి చెందిన జర్నలిస్ట్‌ బీఆర్‌ లోన్‌, సామాజిక కార్యకర్త తెహసీన్‌ పూనావాల జస్టిస్‌ లోయా మృతిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్‌ షేక్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జస్టిస్‌ లోయా 2014, డిసెంబర్‌ 1న గుండెపోటుతో మరణించారు.

కాగా సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు నుంచి అమిత్‌ షాను కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. జస్టిస్‌ లోయా మృతిపై విచారణ చేపట్టాలని న్యాయవ్యవస్థ సహా రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు