గోద్రా అల్లర్లు : మోదీకి క్లీన్‌ చిట్‌

11 Dec, 2019 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2002 గోద్రా అనంతర అల్లర్ల వెనుక నరేంద్ర మోదీ సారథ్యంలోని అప్పటి గుజరాత్‌ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని జస్టిస్‌ నానావతి-మెహతా కమిషన్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. గుజరాత్‌ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వానికి అందిన ఈ నివేదికను రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌ సింగ్‌ జడేజా అసెంబ్లీ ముందుంచారు. కాగా గోద్రా అనంతర ఘర్షణల నేపథ్యంలో అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ గోద్రా వెళ్లి ఎస్‌6 కోచ్‌ను పరిశీలించి సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు నిరాధారమైనవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మోదీ గోద్రా వెళ్లారనే ఆరోపణలనూ నివేదిక తోసిపుచ్చింది. గోద్రా అల్లర‍్లు పకడ్బందీ వ్యూహంతో చేపట్టినవి కాదని తేల్చిచెప్పింది. గోద్రా అనంతరం అల్లర్లను అదుపులోకి తీసుకునివచ్చి సాధారణ పరిస్థితి నెలకొనేలా చేయడంతో సంబంధిత అధికారులతో తాను ఎప్పటికప్పుడు సమీక్షించానని మోదీ చెప్పినట్టు నివేదిక పేర్కొంది. 2002లో జరిగిన గోద్రా అల్లర్లపై రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జీటీ నానావతి, అక్షయ్‌ మెహతాలతో ఏర్పాటైన కమిషన్‌ 2014, నవంబర్‌ 18న తమ తుది నివేదికను సమర్పించింది. గోద్రా అల్లర్లలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వారిలో అత్యధికులు మైనారిటీలే కావడం గమనార్హం. గోద్రా రైల్వేస్టేషన్‌లో శబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో రెండు బోగీలను దగ్ధం చేసిన ఘనలో 59 మంది కరసేవకులు మరణించిన అనంతరం ఈ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు