జస్టిస్‌ రమణ కూడా తప్పుకున్నారు!

1 Feb, 2019 04:07 IST|Sakshi
జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సీబీఐ చీఫ్‌ నాగేశ్వరరావు నియామకంపై విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి

మరో ధర్మాసనం ఏర్పాటు

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగే శ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక చీఫ్‌ నాగేశ్వరరావు తమ రాష్ట్రం వాడేననీ, ఆయన కుమార్తె వివాహానికి కూడా వెళ్లానని అందుకే ఈ ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్‌ ఎన్‌వీ రమణ వివరించారు. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ తర్వాత ఈ పిటిషన్‌ విచారణ నుంచి తప్పుకున్న మూడో జడ్జి జస్టిస్‌ ఎన్‌వీ రమణ. ఆయన వైదొలగడంతో సీనియర్‌ జడ్జి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని మరో ధర్మాసనం ఈ కేసును శుక్రవారం నుంచి విచారిస్తుందని సీజేఐ ప్రకటించారు.

జనవరి 10న ప్రధాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఐపీఎస్‌ అధికారి ఆలోక్‌వర్మను సీబీఐ చీఫ్‌ హోదా నుంచి తొలగించిన అనంతరం ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియామకం సరిగా జరగలేదంటూ కామన్‌కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్ధ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. గురువారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ శంతన గౌడర్, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. ‘సీబీఐ తాత్కాలిక చీఫ్‌ ఎం.నాగేశ్వర రావు, నేనూ ఒకే రాష్ట్రం వాళ్లం. ఆయనతో నాకు పరిచయం ఉంది. న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన అల్లుడు కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా’ అని ప్రకటించారు. కాగా, సీబీఐ చీఫ్‌ ఎంపిక విషయమై చర్చించేందుకు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు.

మరిన్ని వార్తలు