ఉత్తరాఖండ్‌ సీజేగా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌

12 Oct, 2018 02:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతో కూడిన కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం రెండు రోజుల కిందట ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ప్రస్తుతం హైకోర్టులో నంబర్‌ 2గా కొనసాగుతున్నారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్‌ 30 వరకు ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–2004 వరకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు