కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే

31 Oct, 2019 04:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసేందుకు కొలీజియం తిరస్కరించిన వారికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను వెల్లడించనక్కరలేదన్నారు. ఈ మేరకు బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్‌ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కేవలం సమాచారం తెలుసుకోవాలన్న పౌరుల కోరిక తీర్చడం కోసం వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని బహిర్గత పరచడం సరికాదని తన అభిప్రాయమని జస్టిస్‌ బాబ్డే పేర్కొన్నారు.

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే కూడా ఒకరు. న్యాయమూర్తులిచ్చే తీర్పులపై సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను కూడా జస్టిస్‌ బాబ్డే తప్పుపట్టారు. అలాంటి విమర్శలతో చాలామంది న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటారన్నారు. ‘ఉదాహరణకు.. ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంజడ్జీగా పదోన్నతి కల్పించాలనుకుని, ఆ తరువాత పరిశీలనలో తమకందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు జడ్జీగా ఆయన సరికాదని కొలీజియం నిర్ణయిస్తుంది. ముందుగా, ఆయన పేరును పరిశీలించడం ఎందుకు? ఆ తరువాత పదోన్నతికి పనికిరాడని నిర్ణయించి, ఆ విషయాన్ని బహిర్గం చేయడం ఎందుకు? ఆ జడ్జీ ఆ తరువాత కూడా ఆ హైకోర్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కదా! అతనికి అది ఇబ్బందికరంగా ఉండదా?’ అని ప్రశ్నించారు. వారిని బాధపెట్టడం సరికాదన్నారు.  

మరిన్ని వార్తలు