నలబైఏళ్లకు న్యాయం

6 Aug, 2014 23:10 IST|Sakshi

సాక్షి, ముంబై : ఓ వీర పత్నికి 40 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. 1965లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో బాబాజీ జాదవ్ వీరమరణం పొందారు. ఆయన భార్య ఇందిరా జాదవ్ ప్రభుత్వం తరఫున లభించాల్సిన స్థలం కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు కోర్టు మంగళవారం ఇందిరాకు న్యాయం చేసింది. అంతేకాకుండా జాప్యం జరగడానికి గల ప్రధాన కారకుడైన అప్పటి ప్రభుత్వ అధికారి నుంచి రూ.75 వేలు జరిమానా వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆమె వయసు 74 ఏళ్లు ఉండగా అనారోగ్యంతో ప్రస్తుతం పుణేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 పూర్తి వివరాలిలా ఉన్నాయి....
 1965లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ జాదవ్ వీరమరణం పొందాడు. అప్పటి ప్రధాని లాల్ బహాదూర్ శాస్త్రి ఆయన భార్య ఇందిరాకు పది ఎకరాల పంట భూమి ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. కానీ పది ఎకరాల పంట భూమితో పాటు ఇల్లు కట్టుకునేందుకు రత్నగిరిలో ఐదు గుంటలు స్థలం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాన్ని ఆమెకు అందజేయాలని 1967 నుంచి మిలిటరీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం 1994లో ఆమెకు ఖేడ్‌లో ఓ స్థలాన్ని చూపించిం ది.ఆ స్థలం నిర్మాణుష్య ప్రాంతంలో ఉండడం వల్ల దాన్ని స్వీకరించేందుకు ఆమె నిరాకరించింది. ఆ తరవాత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది.  

 బాధితురాలు లాయర్లు అవినాశ్ గోఖలే, మయూరేష్ మోద్గీల ద్వారా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తుల బెంచి పలుమార్లు విచారణ జరిపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటి నుంచి ఇంటి స్థలం ధర ఎంత  నిర్ణయించాలనే దానిపై ప్రభుత్వం తేల్చుకోలేకపోయింది. ఆమెకు ఉచితంగా స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చివరకు కోర్టు ఉచితంగా అందజేయాలని తీర్పునిచ్చింది. ఇంటికోసం అందజేసే స్థలాన్ని 1998 మార్కెట్ రేటు ప్రకారం సగం ధరకే అందజేయాలని ఆదేశించింది.

ఆ ప్రకారం స్థలం రేటు రూ.45 వేలు పలుకుతుంది. రూ.75 వేలు జరిమానా డబ్బులోంచి  మొత్తాన్ని చెల్లించి మిగతా రూ.30 వేలు ఇందిరా జాదవ్ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని కోర్టు చెప్పింది.  ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని, వెంటనే న్యాయం చేయాలని న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్.చందూర్కర్  ఆదేశించారు.

మరిన్ని వార్తలు