‘ఖలిస్తాన్‌’కు మద్దతు ఇవ్వం

22 Feb, 2018 03:18 IST|Sakshi
స్వర్ణదేవాలయంలో చపాతీలు చేస్తున్న ట్రూడో దంపతులు

పంజాబ్‌ సీఎంకు కెనడా ప్రధాని హామీ

9 మంది జాబితా ఇచ్చిన పంజాబ్‌ సర్కార్‌

స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న ట్రూడో

అమృత్‌సర్‌: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్‌ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్‌ సజ్జన్‌లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో ఓ హోటల్‌లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్‌లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్‌ ట్రూడోకు అందజేశారు.

వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్‌ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్‌ సీఎం మీడియా సలహాదారు రవీన్‌ థుక్రల్‌ తెలిపారు. క్యూబెక్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం.

ట్రూడో వ్యాఖ్యలు భారత్‌లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుక్బీర్‌ సింగ్‌ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ అధ్యక్షుడు గోబింద్‌సింగ్‌ లంగోవాల్‌లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్‌జీ లంగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు.

మరిన్ని వార్తలు