యూపీలో కాంగ్రెస్‌ ‘జ్యోతి’.. వెలిగేనా!

14 Mar, 2019 14:28 IST|Sakshi

సింధియా సత్తా చూపేనా..?

ప్రియాంకతో కలసి పార్టీని నడిపించే బాధ్యతలు అప్పగింత

పశ్చిమాన గెలుపు సాధ్యమా..!

భోపాల్‌: మొన్నటి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు రుచి చూపించడంలో తీవ్రంగా కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోనూ పార్టీకి మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆశిస్తోంది.  ఈ మధ్యే పశ్చిమ యూపీ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీగా సింధియాను రాహుల్‌ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో తనను కాకుండా కమల్‌నాథ్‌ను సీఎంగా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించినప్పుడు సంయమనం కోల్పోకుండా పార్టీ కోసం అందరం కలసి కష్టపడతామని అనడం సింధియాను రాహుల్‌కు దగ్గర చేసింది. అందుకే ప్రియాంక గాంధీని తూర్పు యూపీకి కార్యదర్శిగా నియమించిన రాహుల్‌.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీని గెలిపించే బాధ్యతను సింధియాకు అప్పగించారు.

48 సంవత్సరాల జ్యోతిరాదిత్య సింధియా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌ చదివారు. స్టాన్‌ఫర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించిన సింధియా, ప్రస్తుతం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌గా వ్యవహరిస్తున్నారు.     

సింధియాకు సవాల్‌ విసురుతున్న యూపీ
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలుపుబాట పట్టించిన జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వ పటిమకు ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికలు పరీక్షగా మారాయి. యూపీ పగ్గాలు ప్రియాంక, సింధియాకు అప్పగించిన రాహుల్‌ అక్కడ మెజార్టీ సీట్లు గెలిపిస్తారని ఇద్దరిపై నమ్మకం ఉంచారు. ‘‘కాంగ్రెస్‌ భావజాలాన్ని యూపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరు నేతలు విజయవంతమవుతారని తాను విశ్వసిస్తున్నా’’నని రాహుల్‌ గాంధీ ఈ మధ్యే మీడియాతో ధీమా వ్యక్తం చేశారు.  

పశ్చిమాన కాంగ్రెస్‌ మెరిసేనా...?
రాహుల్‌  పశ్చిమ యూపీలోని 39 పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతను సింధియాకు అప్పగించడానికి ప్రధాన కారణం ఉంది. 2009, 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ యూపీతో పోలిస్తే తూర్పు యూపీలో హస్తం పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. 2014 ఎన్నికల్లో పశ్చిమాన కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి సింధియాను సరైన నాయకుడిగా నమ్ముతూ గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు రాహుల్‌. తనపై కాంగ్రెస్‌ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే దిశగా సింధియా అడుగులు వేస్తున్నారు. అక్కడి నాయకులు, శ్రేణుల్లో ధైర్యం నింపే చర్యలను ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు