‘రాహుల్‌ నిష్క్రమణ పార్టీకి నష్టమే’

11 Jul, 2019 14:22 IST|Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ గాంధీ వైదొలగిన అనంతరం పార్టీ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా అంగీకరించారు. పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరీక్షా సమయంలో నేతలంతా సమిష్టిగా కాంగ్రెస్‌ బలోపేతానికి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. పార్టీ నూతన చీఫ్‌గా శక్తివంతమైన నేత అవసరమని అన్నారు.

పార్టీ నేతలంతా సమైక్యంగా రాహుల్‌ చూపిన బాటలో నడవాలని కోరారు. రాహుల్‌కు సంఘీభావంగా సింధియా గత వారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజాతీర్పును ఆమోదించి అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీకి తన రాజీనామా అందచేశానని ఆయన చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే బాధ్యత వహించాలని సింధియా ఆరోపించారు. కర్ణాటక, గోవాల్లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. ఎన్నికల్లో గెలవలేని చోట ఇతర మార్గాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు