ఉద్వేగానికి లోనైన జ్యోతిరాదిత్య సింధియా

20 May, 2019 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓ తండ్రిగా ఎంతో గర్విస్తున్నానంటూ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మహానార్యమన్‌ ప్రతిష్టాత్మక యేల్‌ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం పట్ల ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ ఈరోజు నా తనయుడు మహానార్యమన్‌ సింధియా యేల్‌ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు. ఓ తండ్రిగా ఎంతో గర్విస్తున్నా. మా కుటుంబం మొత్తానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నా నాన్నా’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఈ క్రమంలో భార్య ప్రియదర్శిని రాజే సింధియా, మహానార్యమన్‌లతో కలసి యూనివర్సిటీలో దిగిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో మహానార్యమన్‌కు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.  2002లో తండ్రి మాధవరావు సింధియా మరణంతో గుణ లోక్‌సభ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి నుంచే ఇప్పటి వరకు నాలుగు సార్లు సింధియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక 1994లో మరాఠా గైక్వాడ్‌ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడిన జ్యోతిరాదిత్యాకు కుమారుడు మహానార్యమన్‌, కుమార్తె అనన్య సింధియా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు