ఏమో గుర్రం ఎగురావచ్చు!

5 Aug, 2015 10:40 IST|Sakshi
ఏమో గుర్రం ఎగురావచ్చు!

సాక్షి, స్కూల్‌ఎడిషన్:
 'తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా?'..ఈ రొటీన్ జీవితం ఆయనకు బోర్ కొట్టింది. ఆయనదేమీ మధ్యతరగతి జీవితం కాదు. ఐఐటీ గ్రాడ్యుయేట్. ఢిల్లీ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం. చేతినిండా కాసులు. ఎక్కడికెళ్లడానికైనా కారు. జీవితం మాత్రం బోర్...బోర్. జీవితంలో ఏదో సాధించాలి. ఎవరికైనా ఏమైనా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు. ఏం చేయాలి? సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన మనసును తొలిచిన ఆలోచనలు. అవే ఆయన్ను మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటట్లు చేశాయి. ఆ కార్యక్రమం ఏమిటి? అసలు ఆయన ఎవరు? ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి మరి!


 2008 ఒలింపిక్స్‌కు భారత్ హాకీ జట్టు ఎంపిక కాలేదు. ఈ సంఘటన దేశంలోని కోట్లాది మంది హాకీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.  కానీ ఢిల్లీకి చెందిన ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆర్ముగాన్ని మాత్రం తీవ్రంగా కలచి వేసింది. ఒకప్పుడు హాకీలో ఓ వెలుగు వెలిగిన భారతదేశ ప్రస్తుత దుస్థితికి కారణాలేమిటని తనను తానే ప్రశ్నించుకున్నారు. సమస్యలను మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలనుకున్నారు. హాకీలో భారత సువర్ణాధ్యయాన్ని తిరిగి రాయాలని తలంచారు. అందుకు భావి భారతపౌరులకు హాకీ నేర్పించాలి. వారిని భావి భారత హాకీ రత్నాలుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో తన  ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. విలాసాల కులాసాలను పక్కన పెట్టారు. హాకీ పట్ల తనకు కలిగిన ఆసక్తికి ఆచరణను జోడించారు.
 
 హాకీ సిటిజెన్ గ్రూప్ ఏర్పాటు
  తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి 'హాకీ సిటిజెన్ గ్రూప్' పేరిట ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. పిల్లలను సమీకరించారు. తాను ఎన్నడూ హాకీ ప్లేయర్ కాదు. హాకీ గురించి ఎంతో చదివారు. పిల్లలకు హాకీ గురించి చదివిందల్లా చెప్పారు. వ్యయ ప్రయాసలకోర్చి దేశం నలుమూలల నుంచి కోచ్‌లను తెప్పించి తన విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు.
 
 ప్రభుత్వ పాఠశాలలే ఎందుకంటే..
  తన లక్ష్య సాధనలో ప్రభుత్వ పాఠశాలలనే ఎందుకు ఎన్నుకున్నారు, ప్రైవేట్ పాఠశాలల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తే...'ప్రైవేటు పాఠశాలల్లోని వారితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు సరైన సదుపాయాలు, క్రీడాపరికరాలు ఉండవు. సరైన క్రమశిక్షణతో ఉండరు. అలాంటి వారికి క్రీడల పట్ల ఆసక్తి కలిగిస్తే నిర్దిష్ట జీవనవిధానం అలవడుతుంది'అని ఆర్ముగం తెలిపారు. విద్యార్థులకు సెలవు దినాల్లో శిక్షణ ఇస్తూ చదువుకు ఎలాంటి భంగం కలిగించకుండా చర్యలు తీసుకున్నారు. మొదట్లో విద్యార్థుల్లో 50 శాతం మందికి మాత్రమే హాకీపట్ల నిజమైన ఆసకి ఉండేది. క్రమ క్రమంగా మిగతావారికి కూడా ఆసక్తి కలిగించేటట్టు చేశారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో 25 శాతం మంది బాలికలు ఉండటం విశేషం.
2,400 మందికి శిక్షణ
  ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనకు హాకీ ఆడే శిష్యులు ఏర్పడ్డారు. దేశంలోని 24 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ముగానికి హాకీ టీమ్‌లు ఏర్పడ్డాయి. మొత్తం 2,400 మంది శిష్యులు ఆయన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన టీమ్‌లు జిల్లా స్థాయి టోర్నమెంటుల్లో రాణిస్తున్నాయి.  ఓ ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి టీమ్‌కు కూడా ఎంపికయ్యారు.
 అంకుఠిత దీక్షతో..
 ఓ ప్రవృత్తిగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తాను స్థాపించిన 'హాకీ సిటిజెన్ గ్రూప్' ఎన్జీవో తరఫున సాయం కోసం ఎక్కడికెళ్లినా 'ఎన్జీవో'నా అంటు తొలుత ఛీత్కరించారు. అందుకు కారణం ఎన్జీవోలంటే ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యానికి చిన్నచూపు ఉండటమే.  రానురానూ ఆయన అకుంఠిత దీక్షను గమనించిన పాఠశాలలు ముందుకొచ్చి అండగా నిలిచాయి. హాకీకి పనికొచ్చే స్కూల్ మైదానాలను టీచర్లే పునరుద్ధరించారు. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి ఆయనకు అవసరమైన మేరకు విరాళాలు కూడా అందుతున్నాయి. హాకీకి సంబంధించి పలు పుస్తకాలు, ఆర్టికల్స్ రాశారు.
అవార్డులు
 ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్ముగం...జాతీయ జట్టుకు తన విద్యార్థులు ఎంపిక కావాలని, ఆ దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు అర్హత సాధించడం తన కలని ఆయన చెప్పారు. 'ఏమో గుర్రం ఎగరావచ్చు, ఆయన కల సాకారం కానూ వచ్చు!'

మరిన్ని వార్తలు