నిత్యానందకు నోటీసులపై వింత జవాబు

4 Feb, 2020 08:40 IST|Sakshi

కర్ణాటక హైకోర్టుకు పోలీసుల వింత సమాధానం

బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్‌పోల్‌ నోటీస్‌)

ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్‌ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌ ఇటీవలే బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద)

ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్‌లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్‌పోల్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్‌లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ నిత్యానంద కథేంటి?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా