సాయం కోసం యాత్రికుల పడిగాపులు

3 Jul, 2018 07:38 IST|Sakshi

సాక్షి, హిల్సా : కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్‌ క్యాంపు(భారత్‌-నేపాల్‌ సరిహద్దు)లో భారీ సంఖ్యలో యాత్రికులు చిక్కుకున్నారు. అందులో వందమందికిపైగా తెలుగు వారు కూడా ఉన్నారని విజయవాడ చిట్టీనగర్‌కు చెందిన ఒర్సు మురళీ కృష్ణ, ఒర్సు నాగేశ్వరరావులు తెలిపారు. ఆహారం కూడా దొరక్క యాత్రికులు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గత నెల 27న మనససరోవర్‌ యాత్రకు వెళ్లామని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకున్నారు. డబ్బులు కూడా అయిపోవడంతో యాత్రికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

మంగళవారం ఉదయం కూడా హిల్సా బేస్‌క్యాంప్ వద్ద వాతావరణ పరిస్థితితో మార్పు కనిపించడం లేదు. ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హిల్సా వద్ద 550 మంది, సిమికోట్ వద్ద 525, టిబెట్ వైపు మరో 500 మంది చిక్కుకున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నేపాల్‌గంజ్, సిమికోట్ ప్రాంతాల్లో ఇండియన్ ఏంబసీ ప్రతినిధుల్ని నియమించింది. చిక్కుకున్న యాత్రికులకు భోజన వసతి సదుపాయాలపై అధికారలులు సమీక్ష నిర్వహించారు. సిమికోట్‌లో చిక్కుకున్న యాత్రికులకు స్థానిక వైద్యుడితో ఏంబసీ సిబ్బంది వైద్యపరీక్షలు చేపిస్తోంది. హిల్సాలో చిక్కుకున్న యాత్రికులకు నేపాల్ పోలీసుల సహాయంతో ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కుకున్న యాత్రికులను కుదిరితే సిమికోట్ వైపు, లేదంటే టిబెట్ వైపు తరలించి వైద్య సదుపాయాలు కల్పించాలని టూర్ ఆపరేటర్లకు సూచించారు. సిమికోట్-సుర్ఖేత్, సిమికోట్-జుమ్లా, సిమికోట్-ముగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాత్రికుల్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాత్రికుల కుటుంబ సభ్యుల కోసం ఇండియన్ ఏంబసీ హాట్‌లైన్‌ను నెంబర్‌ను ఏర్పాటు చేసింది. తెలుగువారి కోసం +977-9808082292 నెంబర్‌లో అధికారి పిండి నరేష్‌ అందుబాటులో ఉంటారు. 

మరోవైపు మానస సరోవర యాత్రికులను రక్షించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కోరారు. తెలుగు వారు పడుతున్న కష్టాలను మురళీధర్ రావు వివరించారు. ఎంబసీ అధికారులు రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, యాత్రికులను సురక్షితంగా తరించేలా చర్యలు చేపడుతున్నామని సుష్మా స్వరాజ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు