ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు

26 Sep, 2014 23:42 IST|Sakshi
ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు

న్యూఢిల్లీ: ‘ఐదేళ్ల పిల్లల ఆరోగ్యంపై యునెటైడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో తాను మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు. యూఎన్ సర్వసభ్య సమావేశాల్లో తాను మాట్లాడటం ఇది రెండోసారని ఆమె తెలిపారు. కాగా పిల్లల ఆరోగ్యంలో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా కీలకమని తాను చెప్పిన విషయం అందరికీ నచ్చిందన్నారు.

‘ఇక్కడ నా స్పీచ్‌కు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది..’అని గొప్పగా చెప్పారు. లైఫ్‌బాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘హ్యాండ్‌వాష్ క్యాంపైన్’లో భాగంగా ఆమె మాట్లాడారు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిన్నారులు డయేరియా వంటి అంటువ్యాధుల బారిన పడే అవకాశముందని ఆమె తెలిపారు. ‘చేతులు శుభ్రం చేసుకోవడమనేది చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన అంశం.. అంటువ్యాధుల గురించి మాట్లాడే ప్రతిఒక్కరూ ఈ అంశం ప్రాధాన్యతను అర్థం చేసుకునే ఉంటారు.

 0-2 ఏళ్ల లోపు పిల్లల్లో అధిక శాతం ఈ అంటువ్యాధుల బారిన పడుతున్నారు..’ అని కాజోల్ వివరించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై ఆమె విస్తృత ప్రచారం చేస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో ఆమె యూఎన్ సెక్రటరీ జనరల్ భర్య యూ సూన్-టీక్, గేబాన్ ప్రథమ మహిళ సిల్వియా బాంగో ఓన్డింబా, యునీలివర్ సీఈవో పాల్ పాల్మన్ భార్య కిమ్, నటీమణులు లిల్లీ కోల్, అమీ స్మార్ట్ వంటి మహుమహులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ..‘యూ సూన్-టీక్, పాల్మన్ భార్య చాలా గొప్ప మహిళలు. వారు నేను చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవించారు. నా ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్నారు, పిల్లలకు చిన్నతనం నుంచే శుభ్రతను నేర్పించాలన్న నా వాదనతో వారు పూర్తిగా ఏకీభవించడమే కాక ఆ దిశలో తామూ కృషిచేస్తామని చెప్పడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈ వేదిక నుంచి మేమందరం ఆయా దేశాల్లో చిన్నారులు చేతులు శుభ్రం చేసుకోవడం అంశంపై పూర్తి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చాం.. ఈసారి నా యూఎస్ పర్యటనను నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను..’ అని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు