మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని

27 Aug, 2014 03:18 IST|Sakshi
మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని

మరో మూడు రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లు
 న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంళవారం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావును, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌ను, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలాను, గోవా గవర్నర్‌గా మృదు లా సిన్హా నియమితులయ్యారు. గవర్నర్ల నియామకానికి కేంద్రం ప్రతిపాదించిన పేర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు.

 మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితుడైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా కు చెందిన నేత. గత ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా నియమితుడైన సీనియర్ బీజేపీ నేత 82 సంవత్సరాల కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. కర్ణాటక కొత్త గవర్నర్ 76ఏళ్ల వజూభాయ్ వాలా గుజరాత్ బీజేపీ సీనియర్ నేత. ఇక గోవా గవర్నర్‌గా నియమితురాలైన మృదుల సిన్హా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా,  రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ పదవీ విరమణ కావటం, గోవా గవర్నర్ పదవినుంచి వైదొలగిన వీబీ వాంచూల స్థానాల్లో వీరు నియమితులయ్యారు.

 షీలా దీక్షిత్ రాజీనామా
 కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఢిల్లీలో కలుసుకున్న మరుసటిరోజునే షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. తాను సోమవారమే రాజీనామాచేశానని, దీనిపై ఇంతకు మించి మాట్లాడదలుచుకోలేదని షీలా దీక్షిత్ అన్నారు.
 
అంచెలంచెలుగా గవర్నర్ స్థాయికి..
 సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన,.. బీజేపీలోఅంచెలంచెలుగా ఎదిగారు. 69ఏళ్ల విద్యాసాగర్ రావు వృత్తిరీత్యా న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 1985, 1989, 1994లో కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 1985 నుంచి 1998 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఆయన బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు.

కరీంనగర్ లోక్‌సభ స్థానంనుంచి 1998, 1999లో ఎన్నికై, వాజ్‌పేయి కేబినెట్‌లో స్థానం సాధించారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యుడుగా పనిచేసిన విద్యాసాగర్ రావు, 1972లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఏబీవీపీ విభాగం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతా నిర్వహణా చట్టం(మీసా)కింద ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత జనసంఘ్‌లో, బీజేపీలో కీలకపాత్ర పోషించారు. గోదావరిలో నీటి వృధాను అరికట్టేందుకు సేద్యపునీటి ప్రాజెక్టు నిర్మించాలంటూ 1998లో పాదయాత్ర నిర్వహించారు.

మరిన్ని వార్తలు