కేజ్రీవాల్‌-కమల్‌ భేటీ.. తొందర వద్దు!

21 Sep, 2017 14:06 IST|Sakshi
కేజ్రీవాల్‌-కమల్‌ భేటీ.. తొందర వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ:  రోజుకో ములుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు చాలవన్నట్లు.. ఇప్పుడు కొత్తగా మరో ట్విస్ట్ అదనంగా దానికి వచ్చి చేరింది. గత కొంత కాలంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న కమల్‌ హాసన్‌ను స్వయంగా చెన్నైకి వెళ్లి మరీ కలుస్తున్నాడు ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక ఆసక్తికర చర్చకు దారితీసింది. 
 
రెండేళ్ల క్రితం వీరిద్దరు ఓసారి కలుసుకున్నప్పటికీ.. కమల్‌ తాజా ప్రకటన నేపథ్యంలో గురువారం వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేజ్రీవాల్‌ను లంచ్‌ కోసమే ఆహ్వానించానని కమల్‌ చెబుతున్నప్పటికీ.. పార్టీ లాంఛ్‌ కోసం వీరిద్దరు చర్చిబోతున్నాడంటూ ఇప్పటికే పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్‌కు, కాషాయం పార్టీకి ఉన్న వైరం తెలిసిందే. అదే సమయంలో బీజేపీకి, దానికి పరోక్ష మద్ధుతునిస్తున్న అన్నాడీఎంకేపై కమల్‌ గుర్రుతో ఉన్నాడన్నది తాజాగా చేస్తున్న ట్వీట్లను, వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఆలోచన మాని.. ఆప్‌తో జోడీ కట్టబోతున్నాడా? తమిళ రాజకీయాల్లో చీపురు ప్రస్థానం ప్రారంభించబోతుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేకపోవచ్చేనే కమల్‌ సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి కమల్‌ ఆలోచన ఏంటో ఎవరితోనూ ఇప్పటిదాకా పంచుకున్న దాఖలాలు లేవు. పైగా ఏ పార్టీ మీద కూడా ఆయనకు సదుద్దేశ్యం లేదు. అందుకే వీరిద్దరి భేటీపై తొందరపడి ఊహగానాలు వద్దని మీడియాకు ఆయన సూచిస్తున్నారు. గత నెలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసిన అనంతరం తనది వామపక్ష భావజాలాలని పేర్కొన్న  కమల్‌.. అదే సమయంలో కాషాయం రంగు కాదంటూ పరోక్షంగా ఆయన బీజేపీపై సెటైర్లు కూడా వేశారు.
 
చెన్నైకి చేరుకున్న కేజ్రీవాల్‌...
అప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెన్నైకి చేరుకున్నారు. కమల్‌ హాసన్‌ కూతురు అక్షర హాసన్‌ చెన్నై ఎయిర్‌ పోర్టులో కేజ్రీవాల్‌కు ఘన స్వాగతం పలికింది. అనంతరం ఆయన కమల్‌ ఇంటికి బయలుదేరారు. కేజ్రీవాల్‌ వెంట మరో నలుగురు ఆప్‌ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.