హైకోర్టును ఆశ్రయించిన కమల్‌

15 May, 2019 18:22 IST|Sakshi

సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలు చేసినందుకు తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌​ నేత కమల్‌ హాసన్‌ మద్రాస్‌ హైకోర్టు మధురై బ్రాంచ్‌ను ఆశ్రయించారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే స్వతం‍త్ర భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అని అరవకురుచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో కేసు నమోదవగా, అరవకురుచ్చి పోలీస్‌స్టేషన్‌లోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తనపై కేసులను కొట్టివేయాలని కోరుతూ తన అప్పీల్‌పై తక్షణ విచారణ చేపట్టాలని కమల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారణకు చేపట్టలేదని న్యాయమూర్తి కమల్‌ వినతిని తోసిపుచ్చారు. మరోవైపు కమల్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ బుధవారం పిటిషన్‌ దాఖలు చేయగా కమల్‌ వ్యాఖ్యలు తమ కోర్టు పరిధిలో చేయనందున పిటిషన్‌ను స్వీకరించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు