కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్‌ ఫైర్‌

18 Feb, 2019 07:24 IST|Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకేను, ఆపార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ను గురి పెట్టి మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ ఆదివారం పరోక్షంగా  తీవ్రంగానే విరుచుకుపడ్డారు. గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గు లేదా అని మండిపడ్డారు. చొక్కాలు చింపుకుని నిలబడను అంటూ అసెంబ్లీలో సాగిన పరిణామాల్ని గుర్తు చేస్తూ  స్టాలిన్‌కు చురకలు అంటించారు. అలాగే, పరోక్షంగా రజనీని కూడా టార్గెట్‌ చేసే రీతిలో కమల్‌ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఇటీవల కాలంగా డీఎంకేను టార్గెట్‌ చేసి మక్కల్‌ నీది మయ్యం కమల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం డైరెక్ట్‌ అటాక్‌ అన్నట్టుగా తీవ్రంగానే విరుచుకు పడే పనిలో పడ్డారు. డీఎంకే నిర్వహిస్తున్న గ్రామసభలను ఉద్దేశించి సిగ్గు లేదా, తననే కాపీ కొడతారా అని తీవ్రంగా మండిపడ్డారు. అడయార్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి కమల్‌ హాజరయ్యారు.  కమల్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

విద్యార్థులు రాజకీయాల్లోకి రాకూడదని తాను చెప్పనని వ్యాఖ్యానించారు. తమిళం అన్నది చిరునామా అని, అర్హత కాదని వ్యాఖ్యానించారు. ఏమి చేశాం అన్నది అర్హతగా అభివర్ణించారు. సినిమాల్లోనూ ఉంటారు... రాజకీయాల్లోనూ ఉంటారు...ఇదేం తీరు అని ప్రశ్నించే వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. నాలుగు సినిమాలు చేయాల్సిన చోట ఓ సినిమా చేస్తున్నానని, అది కూడా నిధుల కోసం అంటూ, తనను  ఉద్దేశించి విమర్శలు గుప్పించే వారి మీద ఈసందర్భంగా పరుష పదజాలం ఉపయోగించారు. అతి పెద్ద పార్టీగా చెప్పుకుంటున్న వాళ్లకు గ్రామసభల గురించి ఇన్నాళ్లు తెలియదా అని ప్రశ్నించారు. చిన్న బిడ్డగా ఉన్న తన పార్టీ కార్యక్రమాన్ని కాపీ కొట్టేందుకు సిగ్గు లేదా అని డీఎంకే గ్రామ సభలను ఉద్దేశించి విరుచుకు పడ్డారు.

చొక్కా చింపుకోను: రాజకీయాలోకి వచ్చా, నా భాగస్వామ్యం ఏమిటో చెప్పా...ఇక, మీ భాగస్వామ్యం అందించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను మాత్రం చొక్కా చింపుకుని నిలబడనని, మరో చొక్కాను అసెంబ్లీలోనే మార్చుకునే వాడ్ని అని గతంలో అసెంబ్లీ వేదిగా స్టాలిన్‌ చొక్కా చిరగడం, వివాదం రేగడాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరు ఉన్నా, తమిళనాడుకు జరిగేది ఏమీ లేదని, అందుకే ఢిల్లీలో నేనూ ఉండాలని సంకల్పించినట్టు పేర్కొన్నారు. మీసం మెలేయడం, తొడలు కొట్టడం గౌరవం కాదు అని పేర్కొంటూ, గ్రామసభల్ని కాపీ కొట్టడం కన్నా సిగ్గు మాలిన పని మరొకటి లేదని విరుచుకు పడ్డారు. ఇక, పార్టీ ప్రకటించి, రాజకీయ కార్యక్రమాల్లోకి రాను అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ పరోక్షంగా రజనీని టార్గెట్‌ చేసినట్టుగా కమల్‌ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు