ఆ రెండు పార్టీలకు కమల్‌ ఆహ్వానం!

9 Feb, 2019 16:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కొన్నిపార్టీలు మమ్మల్ని పిలిచాయి, ప్రజలకు ఇష్టం లేదని వదులకున్నాం, మరి కొన్నింటిని మేమే వద్దనుకున్నాం, ఒంటరిగానే పోటీచేస్తాం, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’. మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌  రెండురోజుల క్రితం చెప్పిన మాటలు ఇవి. అయితే అంతలోనే బాణీ మార్చారు. రెండు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపడం ద్వారా సరికొత్త స్వరం ఆలపించారు. ఎన్నికల బరిలో నిలిచి నెగ్గుకురావడం ఆషామాషీ కాదు. అసెంబ్లీ ఎన్నికలైతే ఎంతో కొంత ప్రాంతీయతా భావం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. అదే పార్లమెంటు ఎన్నికలైతే ఓటర్లు జాతీయస్థాయిలో ఆలోచిస్తారు. అందుకే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయపార్టీలు సైతం బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి నడిచేందుకు రంగం సిద్ధమైంది.

కొత్త పార్టీ, ఎన్నికలను ఎదుర్కొనడం కొత్తైన కమల్‌హాసన్‌ కాంగ్రెస్‌–డీఎంకే కూటమిలో చేరేందుకు ఆశపడ్డారు. పార్టీని స్థాపించిన కొత్తల్లోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అప్పటి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్‌ దేశంలోని పలువురు జాతీయనేతలను కమల్‌ కలుసుకున్నారు. వీరంతా కాంగ్రెస్‌ మిత్రపక్షాలే కావడం గమనార్హం. దీంతో రాబోయే ఎన్నికల్లో కమల్‌ కాంగ్రెస్‌తో జతకడతారని అందరూ నమ్మారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం స్థాయిలో పావులు కదిపినా రాష్ట్రస్థాయిలో ఆయనకు పిలుపురాలేదు. అన్నిపార్టీలూ పొత్తులు, సీట్లసర్దుబాట్లలో తలమునకలై ఉన్న తరుణంలో కమల్‌కు దిక్కుతోచలేదు. ఇక ఒంటరిపోరే శరణ్యమని నిర్ణయించుకున్నారు.

తమిళనాడులోని 39, పుదుచ్చేరీలోని ఒక్కటి మొత్తం 40 స్థానాల్లో ఏపార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తమపార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఈనెల 6న ఆయన మీడియా వద్ద అధికారికంగా ప్రకటించారు. అనుకున్నదానికంటే వేగంగా అన్నిగ్రామాల్లోనూ పార్టీ బలపడిందని చెప్పారు. మాపార్టీ సిద్ధాతాలను ఇతర పార్టీలు కాపీకొట్టే స్థాయికి ఎదిగామని చెప్పుకున్నారు. ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పెరిగింది, ఆ ధీమాతోనే పార్లమెంటు ఎన్నికల్లో  ఒంటరిపోరుకు సిద్ధమయ్యామని తెలిపారు. పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వారి పలకిని నేను మోయాల్సి ఉంటుందని, ఎవ్వరినీ భుజాలపై మోసేందుకు తాము సిద్ధంగా లేమని కూడా వ్యాఖ్యానించారు.

రెండో రోజునే రెండు పార్టీలకు పిలుపు:
కమల్‌ ధైర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్న వేళ ఒంటరి పోరుపై వెనక్కు తగ్గడం ద్వారా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరికివారు కొన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడిపోగా డీఎండీకే, పీఎంకేలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరివైపు వెళదామా అని ఆలోచిస్తున్నాయి. ఇదే అదనుగా కమల్‌హాసన్‌ కూటమి ఆలోచనలు మొదలుపెట్టారు. ఈరెండు కూట ముల వైపు వెళ్ల వద్దు, కొత్త కూటమిగా కలిసుందాం రండి అంటూ శుక్రవారం అకస్మాత్తుగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, అన్నాడీఎంకే రెండునూ అవినీతి మచ్చపడినవి, ఇది తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

రాష్ట్రంలో మార్పురావాలి, మంచి తేవాలి అనే మంచి ఉద్దేశంతో రాజకీయపయనం చేస్తున్నపుడు అవినీతిమయమైన పార్టీలు మనకొద్దని అన్నారు. డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్, పీఎంకే అధినేత డాక్టర్‌ రాందాస్‌లతో కమల్‌ పొత్తు చర్చలు ప్రారంభించారు. ఈ రెండుపార్టీలూ ఇప్పటి వరకు అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వైపు మొగ్గి ఉన్నాయి. అనారోగ్యం కుదుటపడి త్వరలో అమెరికా నుంచి చెన్నైకి చేరుకోనున్న విజయకాంత్‌ను ఫోన్‌ ద్వారా కమల్‌ సంప్రదించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు