‘మక్కళ్‌ నీది మయ్యం’

22 Feb, 2018 02:14 IST|Sakshi
కమల్‌ హాసన్‌, పార్టీ జెండా

కొత్త పార్టీ పేరును ప్రకటించిన కమల్‌హాసన్‌

ఐకమత్యం ప్రతీకగా జెండా రూపకల్పన

ప్రజల చేతుల్లో ఆయుధాన్నని స్పష్టీకరణ

అధికారంలోకి వస్తే పేదరికాన్నేపేదది చేస్తానని వ్యాఖ్య

మదురైలో బహిరంగ సభ

హాజరైన ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

కొత్త పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన డీఎంకే, ఏడీఎంకే 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్‌ హాసన్‌ బుధవారం మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్‌ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అలాగే, ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్లుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తరువాత మరొకటి ఉండేలా చిత్రించారు. ఆ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగం సందర్భంగా కమల్‌ వివరించడం విశేషం. దక్షిణ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన ఈ భారీ బహిరంగసభకు కమల్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తాను ప్రజల చేతుల్లోని ఆయుధాన్నని అభివర్ణించుకున్న కమల్‌.. పార్టీ ఏర్పాటు ప్రజాపాలనకు తొలి అడుగని, ఇక్కడున్న ప్రజాసమూహంలోని ప్రతీ ఒక్కరూ నాయకులేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వివాదాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నేను మీకు సలహాలు ఇచ్చే నాయకుడిని కాను. మీ సలహాలు వినే కార్యకర్తను’ అని వేదికపై కమల్‌ చెప్పడంతో ప్రజలంతా చప్పట్లు, ఈలలు, కేరింతలతో కొత్త పార్టీకి స్వాగతం పలికారు.  

వృత్తి కాదు.. నీతి ముఖ్యం!
రాజకీయాల్లో చేరేందుకు వృత్తి ఏమిటనేది ముఖ్యం కాదని, నీతి, నిజాయితీ, సత్యం, ఉద్వేగం వంటి సుగుణాలు కలిగి ఉన్నవారంతా రాజకీయ రంగ ప్రవేశానికి అర్హులేనని కమల్‌ చెప్పారు. ‘తమిళనాడు ప్రజలు ఇంకా ఎన్నాళ్లు అవినీతి పాలనలను భరించాలి.. మూగవారిగా కలలు కంటూ కాలం గడపాలి? ఈ రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు. మంచి మనుషులకే కొరత ఉంది. నేను నాయకుడిని కాదు. మీ సేవకుడిని.  ఓటుకు ఆరువేలు ఇచ్చి నష్టపోతున్నామని నేతలంటున్నారు. నేను డబ్బులిచ్చి ఓటు అడగను.

ఇన్నాళ్లు  ప్రజలు ఓటును అమ్ముకుని మోసపోయారు. మంచి పార్టీకి ఓటేస్తే ఏడాదికి ఆరు లక్షలు సంపాదించుకునే స్తోమత కలుగుతుంది. ఇన్నాళ్లు కావేరి జలాల సమస్యపై నేతలు ఇల్లు కాలుతుంటే బీడి వెలిగించుకున్నట్లుగా వ్యవహరించారు. కర్ణాటక నుంచి నీరు కాదు ప్రజలు తమిళనాడు కోసం రక్తదానం చేసేందుకు సిద్ధం చేస్తాను. మనకు మంచి భవిష్యత్తు ఉంది. నటుడిగా మీ వల్ల సంపాదించాను. ఇందుకు కృతజ్ఞతగా ప్రజలకు ఏమి చేశానని ఆలోచించాను. నాలో తప్పు చేశానన్న భావన కలిగింది. అందువల్లే రాజకీయపార్టీని స్థాపించడం ద్వారా తమిళనాడు ప్రజల రుణం తీర్చుకోవాలని సంకల్పించాను.

ప్రజా సేవకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుంటే మరొకరికి సారథ్యం అప్పగిస్తానే గాని పదవులను పట్టుకుని ఊగిసలాడను.  అవినీతి నిర్మూలనకు ప్రజలు నాతో పాటు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే ప్రజలకు క్వార్టర్‌ బాటిల్, స్కూటర్‌లు ఉచితంగా ఇవ్వను. స్కూటర్లు కొనుక్కునే స్తోమతకు ప్రజలను తీసుకుని వస్తాను.  ఇన్నాళ్లు ఏలిన వారు ప్రజలకు చేసింది శూన్యం. అందుకే నేను రాజకీయాలలోకి  రావాల్సి వచ్చింది’ అని కమల్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుతో మంగళవారం రాత్రి తాను మాట్లాడాననీ, విధానాలను ప్రకటించడం కంటే ప్రజాసంక్షేమ కార్యక్రమాల జాబితాను తయారుచేసుకోవాల్సిందిగా తనకు చంద్రబాబు సూచించారని కమల్‌ చెప్పారు.   

రామేశ్వరం నుంచి ప్రారంభం..
రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇంటిని సందర్శించి కమల్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కలాం దేశభక్తి, ఆశయాలకు తాను ముగ్దుడినయ్యాననీ, ఆయనే తనకు మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత అని కమల్‌ కొనియాడారు. శతాధిక వృద్ధుడైన కలాం అన్న మహమ్మద్‌ ముత్తుమీరన్‌ లెబ్బై మరైక్కయార్‌ను కమల్‌ కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ట్వీట్‌ చేస్తూ ‘నిరాడంబరత నుంచే గొప్పతనం వస్తుంది. గొప్ప వ్యక్తికి చెందిన చిన్న ఇంటి నుంచి నా ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నిజ జీవితపు హీరో కమల్‌: కేజ్రీవాల్‌
కమల్‌ నిజాయితీ గల, నిజ జీవితపు హీరో అని కేజ్రీవాల్‌ ప్రశంసించారు. డీఎంకే, ఏడీఎంకేలు అవినీతి పార్టీలనీ, నిజాయితీ ఉన్న పార్టీకి ఓటేసే అవకాశం ఇప్పుడు తమిళనాడు ప్రజలకు లభించిందని కేజ్రీవాల్‌ అన్నారు. కమల్‌ రాజకీయ అరంగేట్రాన్ని కేరళ సీఎం విజయన్‌ ఓ ప్రకటనలో స్వాగతించారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, బహుళత్వ సమాజాన్ని కమల్‌ పార్టీ గౌరవిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  మాజీ ఐపీఎస్‌ అధికారి మవురియా, నటి శ్రీప్రియ మంగళవారం రాత్రి కమల్‌పార్టీలో చేరారు.  

కాగితపు పువ్వు కమల్‌: డీఎంకే, ఏడీఎంకే
కమల్, రజినీలు సువానస వెదజల్లలేని కాగితపు పువ్వులని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ అన్నారు. స్టాలిన్‌ వ్యాఖ్యలపై కమల్‌ స్పందిస్తూ వాడిపోవడానికి తాను పువ్వును కాదనీ, చెట్టుగా ఎదిగే విత్తనాన్నని బదులిచ్చారు. దీనిపై జయకుమార్‌ మాట్లాడుతూ కమల్‌ జన్యుపరంగా మార్పులు చేసిన విత్తనమనీ, ఎవ్వరికీ ఉపయోగం లేదనీ, భారత్‌లో దాన్ని వాడరని అన్నారు.

పార్టీ, పతాకం
మక్కల్‌ నీది మయ్యంలో మయ్యం అంటే కేంద్రం...మధ్యస్థానం.ప్రజలకు సమపాలన అందించే త్రాసులోని ముల్లు వంటిది. పతాకంలోని ఆరు చేతులూ ఆరు రాష్ట్రాలు, దక్షిణ భారతావనికే  కొత్త మ్యాపు ఇది’ అని కమల్‌ అభివర్ణించారు. మధ్యలో ఉన్న నక్షత్రం రాష్ట్ర ప్రజలని వివరించారు.  

మేనిఫెస్టో
‘నాణ్యమైన విద్య, అవినీతి రహిత పాలన, నిరుద్యోగ నిర్మూలన, కోతలు లేని విద్యుత్‌ నా రాజకీయలక్ష్యాల’ని కమల్‌ పేర్కొన్నారు.  

బాల నటుడిగా ప్రారంభించి..
ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో కొనసాగి ఎన్నో అద్భుత విజయాలను, జాతీయ పురస్కారాలను అందుకున్న కమల్‌ తాజాగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1954లో జన్మించిన కమల్‌ 1960లో ‘కాళత్తూర్‌ కణ్నమ్మ’ చిత్రంలో ఒక అనాథ బాలుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కొద్దికాలం నృత్య సహాకుడిగానూ పనిచేశారు. తర్వాత దర్శకదిగ్గజం, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత దివంగత కె.బాలచందర్‌ దృష్టిని ఆకర్షించిన కమల్‌.. ఆయనతో దర్శకత్వంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

1981లో ‘ఏక్‌ దూజే కే లియే’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశారు. ఎన్నో శృంగారభరిత, పోరాట చిత్రాల్లో నటించిన ఆయన మగువల మనసును కొల్లగొట్టారు. అయితే 2012–13 సమయంలో ఆయన సినీ పరిశ్రమలో కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కమల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విశ్వరూపం చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టి విడుదలకు ఆటంకాలు ఏర్పడటంతో ఓ దశలో ఆయన దేశం విడిచి పోతానని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తొలి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండిన కమల్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అధికార ఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలపై ట్వీటర్‌లో విమర్శలు చేసేవారు. ఏదైనా మాట్లాడాలంటే రాజకీయాల్లోకి రావాలని కొందరు నేతలు అనడంతో అప్పటి నుంచి రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టి పెట్టారు. జయలలిత మరణం, డీఎంకే అధినేత కరుణానిధి వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిన నేపథ్యంలో కమల్‌ పార్టీ పెట్టడం గమనార్హం. తమిళనాడులో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినా, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మినహా మిగతా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.

మరిన్ని వార్తలు