భయపడను..కొత్త పార్టీ పెట్టే తీరుతా..

14 Sep, 2017 18:48 IST|Sakshi
భయపడను..కొత్త పార్టీ పెట్టే తీరుతా..

సాక్షి, చెన్నై: రాజకీయ ప్రవేశంపై గట్టి సంకేతాలు పంపుతున్నసినీ నటుడు కమల్‌ హాసన్‌ ఈ నెలాఖరున కొత్త పార్టీని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నవంబర్‌లో జరిగే స్ధానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన కమల్‌ 4000 మంది అభ్యర్ధులను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలని యోచిస్తున్నారు.

రాజకీయ పార్టీ ఏర్పాటుపై మరికొన్ని రోజుల్లో కమల్‌ ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఏఐఏడీఎంకేలో చీలిక నేపథ్యంలో తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని కమల్‌ భావిస్తున్నట్టు సమాచారం. అభిమానులతో మంతనాలు, పలు వర్గాలతో సంప్రదింపులతో పాటు పార్టీ ముసాయిదాకు తుదిరూపు ఇవ్వడంలో ఆయన బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఇతర కూటముల్లో చేరకుండా సొంత పార్టీ ఏర్పాటుకు కమల్‌ పూనుకోవడం డీఎంకేకు ఇబ్బందికరమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‍ కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. ‘నన్ను హతమారుస్తామనే హెచ్చరికలతో బెదిరింపులు వస్తున్నాయి, వాటికి బెదిరిపోయే పరిస్థితే లేదు కొత్త పార్టీ పెట్టే తీరుతాను, మరే ఇతర ఏ పార్టీలో చేరబోను’  అని స్పష్టం చేశారు. దేశంలో మార్పు అవసరం, ఆ మార్పు నాతోనే, తమిళనాడు నుంచే రావాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. ముంబై నుంచి వెలువడే ఓ వెబ్‌సైట్‌కు కమల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ తమిళ సాయంకాల దినపత్రికల్లో (మాలైమురసు, మాలైమలర్‌) గురువారం ప్రచురితమైంది.

కమల్‌ ఏమన్నారంటే... ‘‘ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నారా అని కొందరు అడుగుతున్నారు. పార్టీ పెట్టాలనే ఆలోచనే ఉంది. ప్రతి పార్టీకీ ఒక సిద్దాంతం అంటూ ఉంటుంది. అలాగే నా ఆలోచనలను అమలు చేసేందుకు వేరుగా ఏర్పాటు చేసే పార్టీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఎందరో రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నా, ఫొటోలు దిగాను. అయితే ఏ పార్టీ సిద్దాంతాలకు నేను లోబడలేదు.

నా ఆశయాలు, ఆలోచనలకు అనువుగా మరేపార్టీ ఉన్నట్లుగా తోచడం లేదు. శశికళను తొలగించడం అన్నాడీఎంకేలో మంచితో కూడుకున్న ముందడుగు. ఈ చర్య కొంత ఆశాభావం రేకెత్తించినా రాష్ట్రంలో మార్పు అవశ్యం. ఆ మార్పును నేనే తీసుకురావాలని, ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. మార్పు తీసుకురావడంలో నా వల్ల ఎంత జాప్యం జరుగుతుందో ముఖ్యం కాదు. ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఓటర్లు నా పనితీరును లెక్కగట్టాలి.

అసలు దేశంలోనే రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే ఆ ప్రజాప్రతినిధిని బాధ్యతల నుంచి తప్పించగలగాలి. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే ఇదే ఏకైక మార్గం. అవినీతి రహిత సమాజం ఏర్పడాలి. అవినీతి ఉన్నచోట నేను ఉండను, నేను ఉన్న చోట అవినీతి ఉండకూడదు.. అదే నా ఆశ ఆశయం. దేశాన్ని బాగుచేయాలని అనుకునే ముందు రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలి. రాజకీయాల్లోకి రావడానికి నాకు ఇదే సరైన సమయం. రాష్ట్రంలో అన్నీ అవకతవకలుగా తయారైనాయి. రాత్రికి రాత్రే మార్పు రావాలని కోరుకోవడం లేదు.

అయితే ఈమార్పు తమిళనాడు నుండే ప్రారంభం కావాలి. అందుకు అవసరమైన పనులను ప్రారంభించాను. ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అవసరం. అయితే ఈ జీవితకాలంలో నేను ఆశించిన మార్పు జరగకపోవచ్చు. రాజకీయాలను శుభ్రం చేసే పనులను భావితరం వారు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నన్ను అంతం చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒకటి నేను పోవాలి లేదా దేశంలో అవినీతి అంతరించిపోవాలి. రెంటినీ ఒకటిగా చూడటం కుదరదు.’’  అని అన్నారు.

మరిన్ని వార్తలు