మోదీజీ మీ విజన్‌ విఫలమైంది..!

6 Apr, 2020 16:52 IST|Sakshi

చెన్నై : కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనే తీరును తప్పుపడుతూ నటుడు, రాజకీయ నేత కమల్‌ హాసన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఘాటైన వ్యాఖ్యలతో బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు ప్రకటించిన లాక్‌డౌన్‌ అమలు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానిస్తూ సార్‌ ఈసారి మీ విజన్‌ విఫలమైందని లేఖలో ప్రస్తావించారు. ప్రణాళికాబద్ధంగా లాక్‌డౌన్‌ ప్రకటించని లోపానికి సాధారణ ప్రజలను నిందించలేమని, ఇంతటి విపత్తుతో ముంచుకొచ్చిన మహమ్మారి కట్టడికి ఎలాంటి ప్రణాళిక, కసరత్తు లేకుండా నోట్ల రద్దు తరహాలోనే లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రధాని నిర్ణయం సరైంది కాదని అన్నారు.

140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన మీకు నాలుగు నెలల ముందే వైరస్‌ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్‌డౌన్‌ ఉత్తర్వులు జారీ చేశారని ప్రధానిని ఉద్దేశించి కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. నోట్ల రద్దు తరహాలోనే భారీ స్ధాయిలో మరో తప్పిదం చోటుచేసుకుంటుందా అనే భయం తనను వెంటాడుతోందని అన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ ప్రకటించిన మరుసటి రోజే ప్రధానికి రాసిన తొలిలేఖలోనూ కమల్‌ పలు అంశాలు ప్రస్తావించారు.

మహమ్మారి వైరస్‌తో అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అణగారిన వర్గాల ప్రజలను ఆదుకునే చర్యలు ప్రకటించాలని కోరారు. ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల కోసం కాకుండా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, పునాదులు దెబ్బతింటే అద్భుత కట్టడాలు సైతం కుప్పకూలుతాయన్నారు. ఏ ఒక్కరూ ఆహారం తీసుకోకుండా నిద్రించే పరిస్థితి ఎదురుకాకూడదని అన్నారు.

చదవండి : నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

మరిన్ని వార్తలు