‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’

28 Jun, 2020 17:52 IST|Sakshi

చెన్నై: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్‌, బెనిక్స్‌లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సీఎం ప‌ళ‌నిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోందని విమర్శించారు. అదే విధంగా తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్‌ కాపర్‌ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టు​కున్న ఘటనను కమల్‌ గుర్తు చేశారు.(ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్‌’లు)

ఇప్పడు పి.జయరాజ్‌, బెనిక్స్‌లపై పోలీసులు దాడి చేశారని ఇది హత్యా నేరం కాదా అని కమల్‌ తీవ్రంగా ప్రశ్నించారు. కాగా, తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్‌ (62) జూన్‌ 19న తన దుకాణాన్ని లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్‌ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఇక 21న వీరిద్దరూ పోలీసుల రిమాండ్‌లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు