‘ఏ పులి బతికుంది పేపర్‌ మీదా? సర్కస్‌ లోనా?’

3 Jul, 2020 19:41 IST|Sakshi

భోపాల్‌: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్‌నాధ్‌ అధ్యక్షతన అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జ్యోతిరాధిత్య ‘సింధియా టైగర్‌ అభి జిందాహై’ (టైగర్‌ ఇంకా బతికే ఉంది) అంటూ వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన కమల్‌నాధ్‌ ‘ఏ టైగర్‌ బతికి ఉంది. పేపర్‌ మీద ఉన్నదా? సర్కస్‌లో ఉన్నదా?’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన దేశంలో రెండు రకాల గుర్రాలు ఉంటాయని, ఒకటి పెళ్లి ఊరేగింపులో ఉండేది, మరొకటి రేసులో ఉండేది అంటూ కమల్‌నాధ్‌ వ్యాఖ్యానించారు. అలాగే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ప్రధాని నరేంద్రమోదీ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (టైగర్‌ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య)

తాను టీ ఎప్పుడూ అమ్మలేదు అన్న కమల్‌నాధ్‌ ... కొంతమంది తమకు తాము టైగర్స్‌ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్‌ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్‌ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసని అన్నారు.ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్‌ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌ గురించి మాట్లాడుతూ, అది బేరసారాల ప్రభుత్వమని, అందులో ఉన్నవారు ఎమ్మెల్యేలు కాదని, బేరమాడి కొనుకున్నవారు  అని కమల్‌నాధ్‌ అన్నారు.  (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్‌!)

మరిన్ని వార్తలు