రైతు రుణమాఫీపైనే సీఎం తొలి సంతకం!

17 Dec, 2018 15:55 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ సమక్షంలో సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు మందు వాగ్దానం చేసినట్టుగానే...  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమల్‌నాథ్‌ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. తద్వారా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణభారం తప్పిందని సీఎంవో అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితరులు హాజరయ్యారు.

కాగా 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిం‍దే. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. అయితే సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుతో కమల్‌నాథ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ, సీఎం కమల్‌నాథ్‌ లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోర్టు తీర్పును రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు