మహిళా అభ్యర్ధులపై కమల్‌నాథ్‌ వ్యాఖ్యల కలకలం

14 Nov, 2018 12:18 IST|Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మహిళా అభ్యర్ధుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టికెట్ల పంపిణీపై విలేకరుల సమావేశంలో కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మహిళా అభ్యర్ధులకు కాంగ్రెస్‌ పెద్దపీట వేయకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా గెలుపు ప్రాతిపదికనే తాము వారికి టికెట్లు కేటాయించామని, కేవలం కోటా కోసమో, డెకరేషన్‌ కోసమో ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించారు.

దీంతో మహిళలను అలంకారప్రియులుగా కమల్‌నాథ్‌ చిత్రీకరించారంటూ బీజేపీ భగ్గుమంటోంది.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీతో పాటు కమల్‌నాథ్‌ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఆరెస్సెస్‌ శాఖా సమావేశాలకు ప్రభుత్వ అధికారులు హాజరు కావడాన్ని నిషేధిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడంపై కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తోంది.

మరిన్ని వార్తలు