బర్త్‌డే పార్టీలోనే ప్రాణాలు కోల్పోయింది

29 Dec, 2017 12:29 IST|Sakshi

ముంబై కమలా మిల్స్ అగ్నిప్రమాదంలో విషాదం

11 మంది మహిళలతో సహా 14 మంది సజీవ దహనం

విచారణకు ప్రభుత్వం ఆదేశం

సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో గురువారం అర్థరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదం నింపింది. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని లండన్‌ టాక్సీ గాస్ట్రోబార్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మహిళలతో సహా 14 మంది సజీవ దహనమయ్యారు. పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ వాణిజ్య సముదాయంలో రెస్టారెంట్లు, పబ్బులు, టీవీ చానళ్ల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన హోటల్‌ చివరి అంతస్థుపైన రూప్‌టాప్‌లో ఉంది. ఇక్కడ మంటలు చెలరేగి మిగతా అంతస్థులకు వేగంగా వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు.

ప్రాణభయంతో పరుగులు
ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెత్తామని ప్రమాదం నుంచి బయటపడిన డాక్టర్‌ సులభ కేజీ ఆరోరా చెప్పారు. చాలా మంది మహిళలు ప్రాణభయంతో పురుషుల మరుగుదొడ్డిలోకి పరుగెత్తడం తాను చూశానని తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని, రెస్టారెంట్‌ వెనుక డోర్‌ నుంచి సిబ్బంది తనను రక్షించారని ఆమె వెల్లడించారు.  

ఊపిరాడక చనిపోయింది
తన సోదరి ప్రీతి రాజగారియా(48) ఊపిరాడక చనిపోయిందని ఆమె సోదరుడు అజయ్‌ అగర్వాల్‌ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘ప్రీతి తన కుమార్తె రుచీతో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. అగ్నిప్రమాదం గురించి తెలియడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా వీరిద్దరూ విడిపోయారు. రచి మెట్ల కిందకు పరుగు తీసింది. ప్రీతి వాష్‌రూములో ఇరుక్కుపోయి, ఊపిరాడక చనిపోయింద’ని అజయ్‌ తెలిపాడు. మృతుల్లో ఎక్కువ మంది ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని గుర్తించారు.


ప్రమాదానికి ముందు స్నేహితురాలితో ఖుష్బు(కుడి)

పుట్టినరోజున విషాదం
ఖుష్బు అనే మహిళ తన 29 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన పలువురు మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ‘రాయిటర్స్‌’ వెల్లడించింది. పుట్టినరోజు జరుపుకున్న ఖుష్బు కూడా మృతి చెందినట్టు ఆమె తాతయ్య తెలిపారు. అద్దాల గోడలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించి బాధితులను కాపాడినట్టు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

విచారణకు ఆదేశం
ఈ ఘటనపై విచారణకు బీఎంసీ మేయర్‌ విశ్వనాథ్‌ మహదేశ్వర్‌ ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమలా మిల్స్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త మంగేశ్ కాలాస్కర్‌ వెల్లడించారు. దీని నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లు లేవని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపారు.


ఘటనాస్థలిలో సహాయక చర్యలు

>
మరిన్ని వార్తలు