కన్హయ్యను జైల్లో ఎలా చూస్తున్నారు?

27 Feb, 2016 08:53 IST|Sakshi
కన్హయ్యను జైల్లో ఎలా చూస్తున్నారు?

దేశద్రోహం కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం రిమాండు ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ను అక్కడ జైల్లో ఎలా చూస్తున్నారు? అతడికి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు.. ఈ వివరాలపై జాతీయ మీడియా దృష్టిపెట్టింది. తీహార్ జైలు అంటే దేశంలోనే అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగినదని అంటారు. అక్కడ కూడా కన్హయ్య భద్రత విషయంలో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ అతడిని ఒక ఐసోలేషన్ సెల్‌లో ఉంచారు. అంటే, ఆ సెల్‌లోకన్హయ్య తప్ప వేరెవ్వరూ ఉండరన్న మాట. అతడికి అందించే ఆహారాన్ని కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

పటియాలా హౌస్ కోర్టులో కన్హయ్యను ప్రవేశపెట్టే సమయంలో తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో తీహార్ జైల్లో కూడా అతడికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో నెంబరు జైల్లో అతడిని పెట్టారు. జైలులో ఉండే సిబ్బందితో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు పోలీసు సిబ్బంది బృందం 24 గంటలూ అతడిని కాపు కాస్తోంది. అతడి భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని గట్టిగా ఉత్తర్వులిచ్చారు. ఇప్పటివరకు కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ముగ్గురినీ విడివిడిగా ప్రశ్నించిన పోలీసులు.. శుక్రవారం మాత్రం ముగ్గురినీ కలిపి విచారించారు.

మరిన్ని వార్తలు